సర్వం సిద్ధం | ready to plus two examinitation | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Mon, Mar 3 2014 1:22 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

సర్వం సిద్ధం - Sakshi

సర్వం సిద్ధం

 చెన్నై:

పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరి కొన్ని గంటల్లో ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఎనిమిది లక్షల 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రెండు వేల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 వేల మందితో ఫ్లరుుంగ్ స్క్వాడ్లు పరీక్షల పర్యవేక్షణకు నియమించారు.

 

 ప్లస్‌టూ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు అభ్యసించేందుకు వీలుంది. ఏడాది కాలంగా చదువుపై దృష్టి పెట్టిన విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. రాష్ట్ర పరీక్షల విభాగం డెరైక్టర్ దేవరాజన్ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
 

కేంద్రాలు:

రాష్ట్రంలో 2,220 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రంలోని 884 మహోన్నత  పాఠశాలలకు చెందిన ఎనిమిది లక్షల పన్నెండు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పుదుచ్చేరిలోని  120 మహోన్నత పాఠశాలల నుంచి 13,528 మంది పరీక్షలు రాయనున్నారు.  

 58 మంది ఖైదీలు :

జైళ్లు సరస్వతీ నిలయాలుగా మారడంతో ప్లస్‌టూ పరీక్షలు రాసే ఖైదీల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 58 మంది ఖైదీ పరీక్షలు రాయడానికి సిద్ధం అయ్యారు. చెన్నై పుళల్ కేంద్ర కారాగారం సెంటర్‌గా పరీక్షకు ఏర్పాట్లు చేశారు. 53,629 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. చెవిటి, మూగ, బధిర, అంధత్వం వంటి శారీరక రుగ్మతలతో బాధ పడుతున్న వాళ్లు వెయ్యి మంది పరీక్షలు రాయడానికి సిద్ధం అయ్యారు. వీరికి లాంగ్వేజ్ సబ్జెకు మినహాయింపుతో పాటుగా, పరీక్షకు అదనంగా ఓ గంట ఇవ్వనున్నారు.

 స్క్వాడ్‌లు:

మొత్తం ఇన్విజిలేటర్లుగా, పర్యవేక్షకులుగా లక్ష మంది సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. నాలుగు వేల మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సిద్ధం అయ్యాయి. విద్యా శాఖ డెరైక్టర్ , జాయింట్ డెరైక్టర్లు, అన్నా వర్సిటీ అధ్యాపకులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారుల నేతృత్వంలోప్రత్యేక స్క్వాడ్‌లు రంగంలోకి దిగనున్నాయి.
 

నిఘా నీడ:

ప్రశ్నా పత్రాలను నిఘా నీడల్లో ఆయా జిల్లా, డివిజన్,నగర,మండల కేంద్రాలకు పంపించారు.   ఆయాప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాల్ని తరలించేందుకు ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేశారు. పరీక్షల కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం మరుగు దొడ్లు, తాగునీటి వసతి కల్పించారు.  
 

 కంట్రోల్ రూం

ఈ ఏడాది ప్రపథమంగా ఓ కంట్రోల్ రూంను చెన్నైలో ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన ఏదేని ఆరోపణలు, తప్పుల తడక గురించి, ఏదేని ఫిర్యాదులు చేయదలచినా ఈ కంట్రోల్ రూంను సంప్రదించవచ్చు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, రెండు నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టుల్లో ఈ కంట్రోల్ రూంలో సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. విద్యార్థులు ఈ కంట్రోల్ రూంలకు ధైర్యంగా ఫిర్యాదులు చేయొచ్చని పరీక్షల విభాగం ప్రకటించింది. 044-28278284, 28278286, 28272088 నంబర్లకు ఫిర్యాదులు చేయాలని సూచించారు.

 మేలో ఫలితాలు:

జాప్యానికి ఆస్కారం లేని రీతిలో ఈ ఏడాది మే మొదటి వారంలోనే ఫలితాలు ప్రకటించనున్నామని పరీక్షల విభాగం డెరైక్టర్ దేవరాజన్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరీక్షలు ఈనెల 25తో ముగియనున్నాయని, 66 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది తమిళ మాధ్యమంలో పరీక్షలు రాయనున్న ఐదు లక్షల 45 వేల 771 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయించినట్లు చెప్పారు. ఈ ఏడాది జవాబు పత్రాన్ని సరికొత్తగా రూపొందించినట్టు వివరించారు. తొలి పేజిలో విద్యార్థుల ఫొటో, నెంబర్లు, పరీక్ష తేదీ, సబ్జెక్టు వివరాలు తామే పొందు పరచి ఉన్నామన్నారు. వాటిని విద్యార్థులు సరి చూసుకుని సంతకం పెడితే చాలు అన్నారు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రశ్నా పత్రం చదువుకునేందుకు పది నిమిషాలు, తొలి పేజీ సరి చూసుకునేందుకు ఐదు నిమిషాలు అదనంగా కేటాయిస్తున్నామన్నారు. పరీక్ష సరిగ్గా 10.15గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.15కు ముగుస్తుందన్నారు.
 

గుర్తింపు రద్దు :

ఏదేని విద్యాసంస్థలు తమ చేతివాటాన్ని ప్రదర్శించినా, మాస్‌కాపీయింగ్‌కు పాల్పడినా, తక్షణం ఆ విద్యాసంస్థల గుర్తింపు రద్దు అవుతుందని దేవరాజన్ హెచ్చరించారు. ప్రశ్నలు తమిళం, ఆంగ్లంలో ఉంటాయని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ సౌకర్యం సైతం కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో శబ్ద కాలుష్యాన్ని సృష్టించొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement