పడిలేచిన రియల్ భూం
Published Mon, Oct 17 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
పుంజుకుంటున్న వ్యాపారం
కలెక్టరేట్ పైనే రియల్టర్ల నజర్
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు
సాక్షి, సిరిసిల్ల : కొత్తజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. రెండు నెలలుగా నెలకొన్న సందిగ్ధంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆటుపోట్లకు గురైంది. ఆద్యంతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిలేచింది. సిరిసిల్లను జిల్లా చేయనున్నారనే ప్రభుత్వ ప్రకటనతో రెండు నెలలక్రితం ఒక్కసారిగా ఈ వ్యాపారం జోరందుకుంది. చాలా మంది రియల్టర్లు వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. మరికొందరు కొత్తగా రియల్టర్‌గా అవతారమెత్తారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భూ యజమానులు భారీగా ధరలు పెంచారు. అయినా వ్యాపారులు భూములు విపరీతంగా కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగింది. ఇదే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మలివిడత నోటిఫికేషన్‌లో సిరిసిల్ల జిల్లా ప్రస్తావన లేకపోవడం, మంత్రి కేటీఆర్ కూడా అదే అంశాన్ని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రియల్ భూమ్ కుప్పకూలింది. అప్పటివరకు రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు.. రియల్ వ్యాపారంలో తమకు నష్టం తప్పదని నీరసించారు. అడ్వాన్స్ ఇవ్వడంతో మిగతా సొమ్ము చెల్లించి తమ భూములు కొనుగోలు చేయాల్సిందేనని భూయజమానులు పట్టుబట్టారు. తాము వాటిని కొనలేమని, ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని రియల్టర్లు ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. దీనిపై కొందరు పోలీసుస్టేçÙన్‌ల తలుపు తట్టారు. ఆ పంచాయితీలు ఇప్పటికీ ఎటూ తేలడంలేదు. ఇదిలా ఉండగానే, ప్రభుత్వం జారీ చేసిన చివరి నోటిఫికేషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాను చేయడం, మంత్రి కేటీఆర్ నూతన జిల్లాను ప్రారంభించడంతో రియల్ భూమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అప్పటిదాకా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్లీ కదలికొచ్చింది. ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, సమీప ప్రాంతాల్లో రియల్టర్లు పాగా వేస్తున్నారు.
కలెక్టరేట్ ‘చుట్టూ’ రియల్ నజర్
ప్రస్తుతానికి రియల్‌ఎస్టేట్ రంగం స్థిరంగా ఉంది. నూతనంగా చేపట్టబోయే కలెక్టరేట్ భవన నిర్మాణం చుట్టూ రియల్ భూమ్ ఆధారపడి ఉంది. సిరిసిల్ల, వేములవాడ నడుమ, సిద్దిపేట రహదారి వైపు తంగళ్లపల్లి సమీపంలో కలెక్టరేట్ భవనం నిర్మిస్తారనే ప్రచారం ఉంది. ఇందుకోసం అనువైన స్థలం ఎంపిక పూర్తి కాగానే, ఆ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం రెట్టింతయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జంటనగరాల తరహాలో..
హైదరాబాద్, సికిందరాబాద్ తరహాలో సిరిసిల్ల, వేములవాడ భవిష్యత్‌లో జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు పట్టణాల నడుమ రియల్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా పుంజుకుంటోంది. సిరిసిల్ల పట్టణం, శివారు, వేములవాడ పట్టణం, శివారు ప్రాంతాలపై రియల్ వ్యాపారులు దృష్టి సారించారు. జిల్లా ఏర్పాటుతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.50లక్షల– రూ.60 లక్షలు ఉండగా, ఇప్పుడు ఎకరాకు రూ.కోటికి పైమాటే అంటున్నారు రియల్టర్లు. సిరిసిల్ల జిల్లా తెరపైకి రానపుడు, జగిత్యాల జిల్లా అవుతుండడంతో, వేములవాడ, జగిత్యాల నడుమ కొండగట్టు ప్రాంతంలో రియల్ వ్యాపారం కొనసాగింది. సిరిసిల్లను జిల్లా చేయడంతో ఆ వ్యాపారమంతా ఇటువైపు మళ్లింది. దీంతోపాటు సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, 17 పోలీస్ బెటాలియన్ తదితర ప్రభుత్వ విభాగాలు ఏర్పాటయ్యే ప్రాంతాలపై రియల్టర్లు కన్నేసి ఉంచారు. ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం ద్వారా భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు.
నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే..
కొత్త జిల్లా.. సరికొత్త వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొనుగోలుదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా లేఅవుట్ లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములు కొనుగోలు చేయకపోవడమే మంచిదంటున్నారు.
Advertisement
Advertisement