- నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్న అసమ్మతి నేతలు
- సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యేందుకు సమాలోచనలు
- సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణను సారథ్యం వహించాల్సిందిగా కోరుతున్న వైనం
బెంగళూరు : మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ ద్వారా అధికార పార్టీ కాంగ్రెస్‌లో రేగిన అసమ్మతి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ ‘జ్వాలలు’ సీఎం సిద్ధరామయ్య పదవికి ముప్పులా పరిణమించాయి. సీఎం సిద్ధరామయ్యపై అసంతృప్తితో రగిలిపోతున్న తాజా మాజీ మంత్రులు, మరికొంత మంది ఎమ్మెల్యేలు హైకమాండ్‌ను కలిసి సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించే దిశగా పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగకపోతే 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం కష్టమంటూ హైకమాండ్‌కు విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ వల్ల పదవిని పోగొట్టుకున్న శ్రీనివాసప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, బాబూరావ్ చించనసూర్, అంబరీష్‌లతోపాటు మంత్రి మండలిలో స్థానాన్ని ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు మాలకరెడ్డి, ఎస్.టి.సోమశేఖర్ తదితరులు 20 మంది అసంతృప్తులు గ్రూపుగా ఏర్పడి తమకు సారథ్యం వహించాల్సిందిగా పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణను కోరినట్లు సమాచారం.
ప్రస్తుతం ముంబైలో ఉన్న ఎస్.ఎం.కృష్ణ మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ అనంతర పరిణామాలపై అసంతృప్త నేతలతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అసంతృప్త నేతల విన్నపాన్ని ఆలకించిన ఎస్.ఎం.కృష్ణ మాత్రం ‘దుందుడుకు నిర్ణయాలు ఏవీ వద్దు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని హైకమాండ్ గమనిస్తోంది. ఈ విషయంపై హైకమాండ్ నిర్ణయమేమిటో వేచి చూద్దాం, అంతవరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వంటి కార్యక్రమాలేవీ చేయబోకండి’ అని పేర్కొన్నట్లు సమాచారం.
ఇక ఈ అసంతృప్త నేతలంతా వారం రోజుల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ ఎదుర్కొనే సమస్యలను వివరించేందుకు సమాయత్తమవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వీటన్నింటితో పాటు జాఫర్ షరీఫ్ వంటి సీనియర్ నేతలు సైతం సీఎం సిద్ధరామయ్యను ‘ఆయనింకా చిన్నపిల్లాడు’ అంటూ సంబోధిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు సీఎం సిద్ధరామయ్య పదవికి ముప్పు తెచ్చిపెట్టే విషయం కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కాగా, మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణలో పదువులను కోల్పోయిన వారితో పాటు అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు అటు బీజేపీ, ఇటు జేడీఎస్‌లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో, అటు తనపై చెలరేగిన అసమ్మతిని చల్లార్చడంతో పాటు పార్టీలోని ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా చూడడంలో సీఎం సిద్ధరామయ్య తలమునకలయ్యారు. ఇక మంత్రి పదవిని పోగొట్టుకొని తనపై విమర్శలకు దిగిన తాజా, మాజీ మంత్రులను బుజ్జగించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయలను సీఎం సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం.