రైల్వే ట్రాక్ డెత్లు గతేడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గాయి...
- గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గుదల
సాక్షి, ముంబై: రైల్వే ట్రాక్ డెత్లు గతేడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఇప్పటివరకు 793 ట్రాక్ డెత్‌లు సంభవించగా గత ఏడాది ఇదే సమయంలో 845 నమోదయ్యాయి. సుమారు ఆరు శాతం వరకు మరణాల సంఖ్య తగ్గినట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. వాడాలా రైల్వే స్టేషన్ పరిధిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19 కాగా, కుర్లా, థానేల్లో రైల్వే స్టేషన్ పరిధిలో 34 మంది రైల్వే ట్రాక్‌లపై ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైల్వే బోగీలలో క్లోజ్డ్ డోర్ విధానం ట్రాక్ మరణాలను కొంతమేర అరికట్టవచ్చని అధికారులు భావించారు. వెస్టర్న్ రైల్వేలో పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని మహిళా బోగీలలో ఈ వ్యవస్థను అమర్చారు.
కల్యాణ్‌లో అధికంగా 65, వాషిలో 57 మరణాల కేసులు నమోదయ్యాయి. ఈ ఇరు రైల్వే స్టేషన్లలో రైలు పట్టాలు దాటుతూ ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. చాలా మంది ఫుట్‌బార్‌కు ప్లాట్‌ఫాంకు మధ్య ఉన్న గ్యాప్‌లో పడి మరణిస్తున్నారు. కొన్ని స్టేషన్లలోనే ప్లాట్‌ఫాం ఎత్తు పెంచారు. సబర్బన్ రైల్వే ప్లాట్‌ఫాంల ఎత్తును ఎంత మేరకు పెంచాలనే విషయమై ఓ బృందాన్ని బాంబే హైకోర్టు నియమించింది. వెస్టర్న్ రైల్వేలో 31 ప్లాట్‌ఫాంల్లో ఎత్తును 920 ఎం.ఎం. వరకు పెంచామని ఓ అధికారి తెలిపారు. సెంట్రల్ రైల్వేలో 24 గాను 13 ప్లాట్‌ఫాంల ఎత్తు పెంచడం పూర్తి అయింది. మే నాటికి ఈ పనులన్ని పూర్తి అవుతాయని, ప్రస్తుతం నాలుగు ప్లాట్‌ఫాంలలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.