రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది.
గుంటూరు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది. ఇప్పటికే భారీ వర్షాలకు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అల్ప పీడనం బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో.. జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకూ ఐదుగురు మృతిచెందినట్టు ఏపీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించినట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే శిబిరాలకు తరలించినట్టు తెలపారు. గుంటూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చినరాజప్ప పేర్కొన్నారు.
సికింద్రాబాద్- గుంటూరు సెక్షన్ నడికుడిలో 20 సెం.మీ వర్షపాతం నమోదు కాగా అక్కడి ఏడు ప్రాంతాలలో రైలు పట్టాలు మునిగిపోయినట్టు దక్షిణమధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా తెలిపారు. సత్తెనపల్లి-పిడుగురాళ్ల మధ్య భారీ వర్షాలతో రైలు పట్టాలు మునిగిపోయినట్టు తెలిపారు. బెల్లంకొండ వద్ద రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులను బస్సులలో పంపించినట్టు చెప్పారు. వరద తగ్గిన వెంటనే మరమత్తులు చేపడతామన్నారు. ఆయా రూట్లలో రాకపోకలు సాగించే 41 రైళ్లను రద్దు చేశామని తెలిపారు. రైళ్లను పాక్షికంగా, మరికొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రైళ్లను నడుపుతున్నామన్నారు. మరమత్తులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్ నుంచి దక్షిణ భారతానికి రైళ్ల రాకపోకలు చాలా వరకు స్తంభించి పోయాయి. ఫలక్నమా రైలు వరద కారణంగా వెనక్కి తిరిగి రావడం జరిగింది. అవసరమైతే పడవలు, హెలీకాప్టర్లను వినియోగించి ప్రయాణికులను సురక్షితంగా తరలిస్తామని చెప్పారు. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం చేశామన్నారు. ప్రయాణికులకు ఆహారాన్ని కూడా ఉచితంగా అందజేసినట్టు రవీందర్ గుప్తా తెలిపారు.
బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల బీభత్సానికి గుంటూరు జిల్లాలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. సత్తెనపల్లి, నరసరావుపేట, చిలలూరిపేట, పెదకూరపాడు, గురజాల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వరద ఉధృతికి కుప్పగంజ వాగులో నలుగురి గల్లంతు కాగా, బ్రాహ్మణపల్లి చెరువు కట్ట తెగి ఒకరు గల్లంతు కావడంతో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
అనుపాలెం-రెడ్డిగూడెం రైల్వే ట్రాక్‌పై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద కారు గల్లంతైంది. కారు నుంచి ముగ్గురు వ్యక్తులు బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. అటు క్రోసూరు మండలం విప్పర్ల వద్ద ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాలకు బస్సు ల రాకపోకలు సైతం స్తంభించి పోయాయి. పలుచోట్ల వరదల్లో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇరుక్కుపోగా అందరినీ సురక్షితంగా బయటకు తెచ్చారు.
గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన 160 మంది విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లలేక పాఠశాలలోనే ఉండిపోయారు. రెంటచింతల మండలంలోని జిడ్డుపాలెం ఆదర్శ పాఠశాల చుట్టూ గోలివాగు, పిల్లివాగు నీరు చేరడంతో.. పాఠశాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేక విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. విద్యార్థులకు పాఠశాలలోనే భోజన వసతులు ఏర్పాటు చేసి అక్కడే ఉండే విధంగా పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు నీటిలో చిక్కుకుపోయారు. నర్సరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ వద్ద గల బ్రిడ్జ్ నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. మేడికొండూరులో అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గుంటూరు మాచర్ల, వినుకొండ వెళ్లే రహదారుల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు, మాచర్ల వద్ద చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.