చెన్నై, సాక్షి ప్రతినిధి:పొంగల్ పండుగల కళను చూడాలంటే పల్లెదారి పట్టాల్సిందే. పచ్చని తోరణాలు, లోగిళ్లలో గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, భగవన్నామ స్మరణ చేస్తూ హరిదాసు కీర్తనలు, భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా కొత్త దుస్తులతో తిరగాడే పిల్లలు సం క్రాంతి శోభను రెట్టింపు చేస్తారు. అయితే పల్లెలే కాదు పట్టణాలు, నగరాలు సైతం ఈసారి పండుగ శోభను సంతరించుకున్నాయి.
‘భోగి’తో విమానాల జాప్యం
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము 4 గంటలకే ఇంటి ముందు భోగిమంటలు వేశారు. సంప్రదాయం ప్రకారం పాత వస్తువులు అందులో వేసి కొత్తదనానికి స్వాగతం పలికారు. నగరమంతా భారీ సంఖ్యలో భోగిమంటలు వేయడం వల్ల వాటి ధాటికి దట్టమైన పొగ కమ్ముకుంది. దీనికి తోడు మంచు దుప్పటి ఉండనే ఉంది. దీని ప్రభావం వల్ల చెన్నై విమానాశ్రయానికి చేరుకోవాల్సిన మూడు విమానాల్లో జాప్యం ఏర్పడింది. కువైట్, కౌలాలంపూర్, షార్జా విమానాలు మూడుగంటలు ఆలస్యంగా చెన్నైకి చేరుకున్నాయి. బెంగళూరుకు వెళ్లాల్సిన విమానాన్ని అకస్మాత్తుగా రద్దుచేయడంతో దీనికోసం వేచివున్న వందమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఖాకీల కోలాహలం
పోలీసు సిబ్బంది అనగానే ఖాకీ దుస్తులే కళ్లకు కనపడతాయి. అయితే పండుగ రోజును ఖాకీని పక్కన పెట్టి పట్టు వస్త్రాల ధరించారు. చెన్నై హైకోర్టు, న్యాయ కళాశాలల పరిధిలో విధులు నిర్వర్తించే స్త్రీ, పురుషులు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమయ్యూరు. సుమారు 250 మంది పోలీసులు రంగు రంగులతో అలంకరించిన కుండలు చేతబట్టి పొంగళ్లు వండారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి ఆటపాట, ముగ్గుల పోటీల్లో మునిగి తేలారు. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సోమయాజీ ఈ కార్యక్రమానికి హాజరై పోలీసులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
నేతల శుభాకాంక్షలు
తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు జరుపుకుంటూనే వాతావరణ పర్యావరణాన్ని కాపాడుకోవాలని సందేశంలో పేర్కొన్నారు. పండుగలు జరుపుకోవడంలోని అంతరార్థం మానవ సంబంధాలు మెరుగుపడటమేనని ముఖ్యమంత్రి జయలలిత సందేశమిచ్చారు. ప్రపంచంలోని తమిళులంతా సంతోష, సౌభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. చెన్నై వైఎంసీఏ మైదానంలో కనిమొళి నేతృత్వంలో మూడురోజులపాటూ సాగే పొంగల్ ఉత్సవాల్లో డీఎంకే అధినేత కరుణానిధి పొల్గొంటున్నారు. ఈ సందర్భంగా కరుణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరులో ప్రజలకు ఉచితంగా కుట్టుమిషన్లు, పంచె, చీరలు పంపిణీచేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి జీకే వాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్, సమత్తువ మక్కల్ కట్చి అధినేత, నటుడు శరత్‌కుమార్ తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
సముద్రతీరాల్లో స్నానాలు నిషేధం
పండుగల సందర్భంగా ఈనెల 14, 15, 16 తేదీల్లో సముద్రతీరాలు, పార్కులు, ఉద్యానవనాలు జనంతో కిక్కిరిసిపోతాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్రంలో స్నానాలపై పూర్తిగా నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు లోనికి వెళ్లకుండా సముద్రతీరం వెంబడి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళలను గేలి చేయడం, గొలుసు దొంగతనాలు చేసే రౌడీమూకలను అదుపుచేసేందుకు మఫ్టీలో మహిళా పోలీసులను నియమిస్తున్నారు. చెన్నై మెరీనా తీరం వద్ద ఐదు ఔట్‌పోస్టు పోలీసు స్టేషన్లు, 8 చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. జనం రద్దీని అదుపుచేసేందుకు పోలీస్ అశ్వదళాలను రంగంలోకి దించుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ జార్జ్ చెప్పారు.
భోగి వైభవం
Published Tue, Jan 14 2014 12:16 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement