సంక్రాంతి సందడి | Sankranti celebrations in Chennai | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సందడి

Published Mon, Jan 13 2014 4:11 AM | Last Updated on Fri, Jul 6 2018 3:37 PM

సంక్రాంతి సందడి - Sakshi

సంక్రాంతి సందడి

 సంక్రాంతి సందడి ఆరంభం అయింది. స్వగ్రామాలకు బయల్దేరిన నగరవాసులతో బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. పండుగ సమయం ఆసన్నం కావడంతో ఆదివారం మాల్స్, మార్కెట్లలో కొత్త దుస్తులు, పూజా సామగ్రి కొనుగోలు జోరుగా సాగింది. సోమవారం భోగి పండుగను పొగ రహితంగా జరుపుకుందామని పర్యావరణ శాఖ పిలుపునిచ్చింది. పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లకు పోలీసు యంత్రాంగం ఆదేశించింది.
 
 సాక్షి, చెన్నై: రాష్ర్టంలో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగ రానే వచ్చింది. సోమవారం భోగి, మంగళవారం  సంక్రాంతి, బుధవారం కనుమ, గురువారం కానం పొంగళ్  పర్వదినాల్ని జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అయ్యారు. పండుగ సమయం ఆసన్నం కావడంతో షాపింగ్ నిమిత్తం ఆదివారం పెద్దఎత్తున మాల్స్, మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో నగరంలోని వాణిజ్య కేంద్రాలు ఎటు చూసినా జనంతో కళకళలాడయి. ఇంటి ల్లిపాది కొత్త దుస్తులు, సంక్రాంతి పొంగళ్ల కోసం కుండలు, చెరకులు, పూజా సామగ్రి, భోగి పండుగ కోసం తప్పెట్లు...ఇలా అన్ని రకాల వస్తువుల కోసం జనం పోటెత్తడంతో టీ నగర్, పురసై వాక్కం, ప్యారిస్ ప్రాం తాలు కిటకిటలాడాయి. అదే సమయంలో పూజా సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు ఆమాంతం పెరిగినా, చేసేది లేక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. నగరంలోని కోయంబేడు మార్కెట్లో నల్ల చెరకులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఒక కట్ట రూ.300 నుంచి పలుకుతోంది. యాపిల్ వంటి పండ్ల ధరలు గత వారం కంటే 25 శాతం మేరకు  పెరగడం గమనార్హం.
 
 భోగి తప్పెట్లు: కష్టాలు వైదొలగి, తమ బాధలన్నీ మంటల్లో ఆహుతినిచ్చే రీతిలో భోగి మంటల్ని వేస్తూ వస్తున్నారు. ఇళ్లలోని పాత వస్తువుల్ని, చాప, చీపురు కట్టలు వంటివి ఈ భోగి మంటలో వేస్తారు. ఈ భోగి పండుగను చిన్న పిల్లలు భలే సరదాగా చేస్తారు. తప్పెట్లు వాయిస్తూ కేకలు పెడుతూ ఆనందాన్ని ఆస్వాదించే ఈ పండుగ కోసం మార్కెట్లో తప్పెట్లు కొలువు దీరాయి. మెట్టు పాళయం, పెరంబూరు, చూళై, ఆరుదొడ్డిల్లోని గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన ఈ తప్పెట్ల పండుగ రోజున మార్మోగనున్నాయి. 
 
 రైళ్లు, బస్సుల్లో జనమే జనం: ఇంటిల్లిపాది ఆనందంతో జరుపుకునే పెద్ద పండుగకు సెలువులూ ఎక్కువే. దీంతో నగరంలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు పండుగ కోసం తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దక్షిణాది జిల్లాలకు చెందిన వేలాదిమంది ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర పనుల నిమిత్తం చెన్నైలో ఉంటూ వస్తున్నారు. వీరంతా ఒక్కసారిగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు తరలిరావడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి.
 
 చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో దక్షిణాది జిల్లాల వైపుగా ఎనిమిది రైళ్లు పయనిస్తుండటంతో ఆ రైళ్ల బోగీలు ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడాయి. రిజర్వేషన్ లేని వాళ్ల కోసం ఆదివారం కూడా ప్రత్యేక క్యూలను పోలీసులు నిర్వహించారు. అయితే, ప్రత్యేక రైళ్లను ఈ సారి పెద్దగా నడపకపోవడాన్ని తీవ్రంగా ప్రయాణికులు విమర్శించారు. ఇక కోయంబేడు బస్టాండ్ జన సందోహంతో నిండింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడిపినా, ఆమ్నీ బస్సుల వద్దకు జనం పరుగులు తీయక తప్పలేదు. ప్రభుత్వ బస్సులు కిట కిటలాడటంతో ఆమ్నీ యాజమాన్యాలు తమ పనితనాన్ని ప్రదర్శించారు. చార్జీలను పెంచినా, ఆ బస్సుల్లో ప్రయాణించక తప్పలేదు. భద్రత: పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం గట్టి భద్రతకు ఆదేశించింది. చెన్నై మహానగరంలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మెరీనా తీరంలో స్నానం చేయడాన్ని నిషేధించారు. భోగి రోజు(సోమవారం) టైర్లు, ప్లాస్టిక్ వస్తువులను కాల్చితే మాత్రం చర్యలు తప్పదని హెచ్చరించారు. 
 
 పర్యావరణానికి ఆటంకం కలగని రీతిలో, ప్రమాదాలకు చోటు ఇవ్వకుండా భోగిని జరుపుకుందామని ప్రజలకు పర్యావరణ శాఖ పిలుపు నిచ్చింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాలు, పెట్రోల్ బంకుల సమీపాల్లో అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. సంక్రాంతి పర్వదినం మంగళవారం, తిరువళ్లూర్ డే, కనుమ బుధవారం, గురువారం  కానుం పొంగళ్ పర్వదినాల్ని పురస్కరించుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కానం పొంగళ్ రోజున  పెద్ద సంఖ్యలో జనం పర్యాటక ప్రాంతాలకు తరలి వస్తుంటారు.  కుటుంబ సమేతంగా ఆ రోజును ఉల్లాసంగా గడుపుతుంటారు. దీంతో నగరంలోని పర్యాటక కేంద్రాలు, బీచ్‌లలోను నిఘా పెంచారు. వాణిజ్య సమూదాయాలు, సినిమా థియేటర్ల వద్ద కూడా భద్రత పెంచారు. ప్రధానంగా మెరీనా తీరంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లు రంగంలో దించేందుకు నిర్ణయించారు. అత్యవసర వైద్య సేవల శిబిరాలు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు పనులు వేగవంతం చేశారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement