చిన్నమ్మ టీం!
► నాంజిల్ నేతృత్వం
► అన్నాడీఎంకే–3కి చర్యలు
► కార్యక్రమాల విస్తృతం
► దినకరన్‌కు మద్దతుగా ముందుకు
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు మద్దతుగా అన్నాడీఎంకేలో కొత్త జట్టు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ ఈ జట్టుకు నేతృత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. దినకరన్ నిర్ధోషి అని చాటుతూ కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నారు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే చిన్నాభిన్నమైంది. అమ్మ నెచ్చెలి శశికళ ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినా, సీఎం కూర్చీలో కూర్చోవాలని ఆశ పడ్డా, చివరకు కేసులు వెంటాడడంతో పరప్పన అగ్రహార చెరలో కాలం నెట్టుకు రావాల్సిన పరిస్థితి.
చిన్నమ్మను ధిక్కరించి అన్నాడీఎంకే నుంచి మాజీ సీఎం పన్నీరు సెల్వం బయటకు రావడం, ఆయన వెంట తాజా, మాజీలు అనేక మంది నడవడం చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకేకు తానే వారసురాలినంటూ జయలలిత మేన కోడలు దీపా తెర మీదకు వచ్చినా, ఎంజీఆర్, అమ్మ, దీప పేరవైతో కేడర్ హంగామా సృష్టించినా, చివరకు మున్నాళ్ల ముచ్చటగా మారింది. ఇక, ఎన్ని జట్లు పుట్టుకొచ్చినా ప్రభుత్వం పతనం కాకుండా చిన్న మ్మ కనుసనల్లో సీఎం పళని స్వామి పాలన కొన్నాళ్లు చెప్పవచ్చు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి చిన్నమ్మ ప్రతినిధి, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ సైతం కేసుల్లో ఇరుక్కుని జైలు బాట పట్టడం పళనిస్వామికి కలిసి వేచ్చే అంశంగా మారింది.
పాలనా పరంగా పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతూ, పార్టీని గుప్పెట్లో ఉంచుకునేందుకు తీవ్రంగానే కసరత్తుల్లో ఉన్నారు. అలాగే, పన్నీరు శిబిరాన్ని కలుపుకునే రీతిలో చర్చల ప్రయత్నాలు సాగినా, అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. చిన్నమ్మకు వ్యతిరేకంగా ఏదో ఒక రోజు పళనిస్వామి నిర్ణయం తీసుకోవడం, పన్నీరుతో చేతులు కలపడం ఖాయం అన్న విషయాల్ని, తాజా పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన నాంజిల్ సంపత్, ఇక, చిన్నమ్మటీంను సిద్ధం చేయడానికి రెడీ అయ్యారు.
చిన్నమ్మ టీం: సీఎం పళని నేతృత్వంలో అన్నాడీఎంకే అమ్మ, మాజీ సీఎం పన్నీరు నేతృత్వంలో అన్నాడీఎంకే పురట్చి తలైవి పేరిట ప్రస్తుతం శిబిరాలు సాగుతున్నా, మున్ముందు రోజుల్లో అన్నాడీఎంకే (చిన్నమ్మ) శిబిరం తెర మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మదురై మేలూరు వేదికగా కేవలం చిన్నమ్మ, దినకరన్‌లకు మద్దతుగా సాగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కేడర్ తరలిరావడంతో చిన్నమ్మ టీంకు పునాదులు వేయడానికి నాంజిల్ సిద్ధం అయ్యారు.
అన్నాడీఎంకే భవిష్యత్తు చిన్నమ్మ శశికళ, దినకరన్‌ల ద్వారా మాత్రమే సాధ్యం అని, ఆ ఇద్దరికి మద్దతుగా ముందుకు సాగుదామన్న నినాదంతో కార్యక్రమాల విస్తృతానికి రెడీ అయ్యారు. కేంద్ర కుట్రలో భాగంగా దినకరన్ తీహార్ జైల్లో బందీ కావాల్సి వచ్చిందని, ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించే విధంగా పోరాటాలు సాగిద్దామని నాంజిల్ పిలుపు నివ్వడం గమనార్హం. చిన్నమ్మకు మద్దతుగా ఏకం అవుదామన్న పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తన గళం , వాక్ చాతుర్యంతో చిన్నమ్మ టీం బలోపేతానికి అన్నాడీఎంకే సిద్ధాంతాల డిప్యూటీ ప్రచార కార్యదర్శి, అ«ధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ కార్యచరణ సిద్ధం చేసుకోవడ గమనించాల్సిన విషయం.