
భద్రత కరువు
సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి మహిళలు రావడం అంతంత మాత్రమేనని, వచ్చినా భద్రత కరువు అవుతోందనడానికి తానే నిదర్శనమని అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో రూపంలో బెదిరింపులు ఇస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తగ్గేది లేదని, తాను పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే అధినేత్రి , సీఎం జయలలిత ఆదేశాలను ధిక్కరించి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్న శశికళ పుష్పకు దడ పుట్టించే రీతిలో రాష్ట్రంలో ప్రయత్నాలు సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు పోలీసు స్టేషన్లలో హోరెత్తుతున్నాయి. అదే సమయంలో తూత్తుకుడిలోని ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు పిల్లలు ఇచ్చిన లైంగిక దాడి ఫిర్యాదు శశికళ పుష్పా గుండెల్లో గుబులు రేపింది.
ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు శశికళ పుష్పా, ఆమె భర్త లింగేశ్వర తిలకం, తనయుడు ప్రదీప్ రాజా, తల్లి గౌరీ ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో పడ్డారు. మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయడం, ఇందుకు ప్రభుత్వం తరఫున ఆక్షేపణ వ్యక్తం కావడం వెరసి కోర్టుకు రావాలని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. కోర్టుకు హాజరైన పక్షంలో అరెస్టు చేస్తారన్న భయంతో చివరకు సుప్రీంకోర్టు ద్వారా ప్రత్యేకంగా స్టే తెప్పించుకుని మరీ మధురై ధర్మాసనంలో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రత కరువు:
అరెస్టుల భయంతో సింగపూర్ చెక్కేసిన శశికళ పుష్పాకు సుప్రీంకోర్టు అండగా నిలవడంతో మధురైలో అడుగు పెట్టేందుకు నిర్ణయించారు. ఆగమేఘాలపై ఆదివారం రాత్రి చెన్నైకు చేరుకుని సోమవారం ఉదయాన్నే మధురైలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు విచారణకు హాజరై తన వాదన వినిపించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను వేధించడమే లక్ష్యంగా పనిగట్టుకుని మరీ ఫిర్యాదులు, కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లోకి మహిళలు రావడం అంతంత మాత్రంగానే ఉందని, వచ్చినా భద్రత లేదనేందుకు తానే నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఏ విధంగా హింసిస్తున్నారో, బెదిరిస్తున్నారో, హెచ్చరిస్తున్నారో తనకు మాత్రమే తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎంపీకే భద్రత కరువైనప్పుడు, ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఏ పాటిదో అర్థం అవుతుందన్నారు. పోలీసులే స్వయంగా బెదిరిస్తున్నారని, కేసులు పెడుతామని, ఇంటి చుట్టు తిరుగుతున్నారని మండి పడ్డారు. తన కుటుంబాన్ని వేధించినా, తన మీద ఎన్నికేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాజ్యసభ పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు ఇక్కడ ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ రాజ్య సభ దృష్టికి తీసుకెళ్తాననన్నారు.