► జోరుగా సమీకరణలు
► అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
► శశికళే వారసురాలని పొన్నయ్యన్ పునరుద్ఘాటన
► శశికళ కోసం దక్షిణ చెన్నైలో తీర్మానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పగ్గాలను శశికళకు అప్పగించేందుకు పార్టీలో జోరుగా సమీకరణల పర్వం సాగుతోంది. అగ్రనేతలంతా ఏకతాటిపై నిలబడి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సీఎం పన్నీర్‌సెల్వం సహా నేతలంతా నడుం బిగించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. పెద్దగా తర్జనభర్జన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి పదవి పన్నీర్‌సెల్వాన్ని వరిం చింది. జయ రెండు సార్లు జైలు కెళ్లినపుడు పన్నీర్‌సెల్వంకే సీఎం బాధ్యతలు అప్పగించడంతో ఆమె అభీష్టానికి అనుగుణంగా పన్నీరుకే పట్టం కట్టారు.
అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరనే విషయంలోనే పెద్ద చిక్కువచ్చిపడింది. అందరి దృష్టి జయలలిత నెచ్చెలి శశికళపైనే పడింది. శశికళ సైతం మౌనమే అంగీకారంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా తన మద్దతుదారులను కూడగడుతున్నారు. జయ జైలుకెళ్లిన రెండు సందర్భాల్లోనూ సీఎం పదవికి పన్నీర్‌సెల్వం పేరును సూచించింది శశికళే కావడంతో నేటి రాజకీయ పరిస్థితుల్లోనూ ఆమెకు నమ్మిన బంటుగా మారారు. పన్నీర్‌సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. శశికళకు అనుకూలంగా సమీకరణలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి 135 మంది ఎమ్మెల్యేలను రప్పించిన సీఎం పన్నీర్‌సెల్వం వారితో సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా వారితో చర్చలు జరిపిన విషయాలను గోప్యంగా ఉంచారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరినీ మూడు ఏసీ బస్సుల్లో పోయెస్‌గార్న్ లో ఉన్న శశికళ వద్దకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో శశికళ సైతం సుమారు రెండువేల మంది సీనియర్ నేతలను పిలిపించుకున్నారు. జయలలిత మరణించి 11వ రోజైన కర్మలను నిర్వహించారు. ఆ తరువాత అందరూ కలిసి మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ దక్షిణ చెన్నై విభాగం నేతలు సమావేశమై శశికళను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరుతూ తీర్మానం చేశారు.
1991లో జయలలిత శ్రీరామ్ చిట్‌ఫండ్స్‌లో రూ.7లక్షలు పెట్టుబడి పెట్టారని, ఈ బాండులో నామినీగా శశికళను పెట్టారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నయ్యన్ చెప్పారు. ఆయా పత్రాలను మీడియాకు చూపుతూ జయకు వారసురాలు శశికళ అని చెప్పేందుకు ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలని వ్యతిరేకిస్తున్న వారికి పరోక్షంగా సవాల్ విసిరారు. ఎవరు ఎంతగా శశికళకు మద్దతు పలుకుతున్నా పార్టీలోని ఒక బలమైన సామాజికవర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. శశికళ నియామకాన్ని సహించబోమని అంటూ చాప కింద నీరులా పావులు కదుపుతోంది. ఈనెల 21వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు గతంలో ప్రకటించినా సమీకరణల నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.