వేలిముద్ర శాసనంతో వెతలు
ఏడాది క్రితం వరకు సంతకం రానివారిని చూసి గేలిగా నవ్వేవాళ్లు. కానీ నేడు ఆ వేలిముద్రే శాసనంగా మారింది. అదే చివరకు మధ్యాహ్న భోజన బియ్యానికి సైతం తిప్పలు తెచ్చిపెట్టింది. ఉన్న వాటితో పండుగ వరకు సర్దుబాటు చేసుకోవచ్చు... కానీ ఆ తరువాత మాత్రం పరేషాన్ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.
► మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాకు ఆటంకం
► పండుగ దాటితే పరేషానే!
ఒంగోలు: జిల్లాలో మొత్తం 3374 పాఠశాలల్లో మధ్యాహ్న బోజన పథకం అమలవుతోంది. గత ఆగస్టు నెలవరకు పాఠశాలలు తమ ఇండెంట్‌ను ఎంఈవోకు అందజేసేవాళ్లు. ఎంఈవో ఇండెంట్‌ను తహసీల్దారు కార్యాలయానికి పంపడం, అక్కడ నుంచి జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి చేరేవి. తద్వారా పౌరసరపరాలశాఖ నుంచి విడుదలయ్యే అలాట్‌మెంట్ వివరాలు కూడా పౌరసరఫరాలశాఖ జిల్లా కార్యాలయానికి, అక్కడ నుంచి ఎంఆర్‌వో కార్యాలయాలకు, పాఠశాలలకు అందేవి. దాని ప్రకారం రేషన్‌డీలర్‌కు సరుకు రిలీజ్ కావడం, ప్రధానోపాధ్యాయుని సంతకంతో బియ్యం విడుదల చేసేవారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ఈనెల మొత్తం 820 టన్నులు అవసరం అని పాఠశాలల నుంచి సమాచారం అందింది. ప్రభుత్వం మాత్రం రేషన్ డీలర్ల వద్ద మిగిలి ఉన్న నిల్వలను దృష్టిలో ఉంచుకొని 705 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. రేషన్ డీలర్లు ఆ బియ్యాన్ని బయోమెట్రిక్ ద్వారా పాఠశాలలకు సరఫరా చేయాలి. ఇందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాద్యాయులు లేదా కుకింగ్ ఏజెన్సీలు వేలిముద్ర ద్వారా సరుకు డెలివరీ చేస్తారు. చాలాచోట్ల బయోమెట్రిక్ యంత్రాలతో సమస్య మొదలైంది. వారి వేలిముద్రలను అవి అగీకరించడంలేదు. దీంతో సమస్య నెలకొంది. రేషన్ డీలర్లు సరుకును అందజేసేందుకు సిద్ధంగా ఉన్నా సర్వర్ సమస్యతో పంపిణీకి ఆటంకంగా మారింది.
ఈ కారణంగానే మొత్తం 3374 పాఠశాలలకు గాను ఈనెల 26వ తేదీ వరకు 2023 పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం పంపిణీ చేశారు. పంపిణీ అయిన మొత్తం బియ్యం 536 టన్నులు. దీని ప్రకారం 1351 పాఠశాలలకు ఇంకా 236 టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వచ్చిన మాట నిజమే అని, గతంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ప్రకారం పంపిణీ అయిన బియ్యం ఎక్కువుగా ఉండడం, భోజనం చేసిన విద్యార్థుల శాతం తక్కువుగా ఉండడంతో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవని అధికారులు పేర్కొంటున్నారు. దసరా శెలవుల అనంతరం మాత్రం ఇబ్బందులు ప్రారంభం అవుతాయని కనుక ఈ నేపథ్యంలోనే బయోమెట్రిక్ సమస్యలు పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంటున్నారు.