రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత,
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధువులు సుధాకరన్, ఇళవరసిలపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్నది. ఈ కేసు విచారణ నిమిత్తం పలు మార్లు జయలలిత బెంగళూరు ప్రత్యేక కోర్టు మెట్లు ఎక్కారు. అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసు విచారణ తాజాగా తుది దశకు చేరుకుంది.
ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా డీఎంకే ఆరోపిస్తూ వస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే విచారణలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇటీవల ప్రత్యేక కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేసింది. విచారణ తుది దశకు చేరుకున్న దృష్ట్యా, తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ జయలలిత అండ్ కో లో నెలకొంది. గతంలోలాగా మళ్లీ వాయిదాల పర్వానికి తెర లేపేందుకు సిద్ధం అయ్యారు. విచారణ సమయంలో వెలుగులోకి వచ్చిన సెలక్స్ సంస్థ వ్యవహారాన్ని ఎత్తి చుపుతూ విచారణపై స్టే తీసుకునే ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఓ వైపు ఆ సంస్థ ప్రతినిధులు, మరో వైపు జయలలిత నేతృత్వంలో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
చుక్కెదురు: సుప్రీం కోర్టులో దాఖలైన ఈ పిటిషన్లపై విచారణ మంగళవారం డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. వాదనల అనంతరం సెలక్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ తోసి పుచ్చింది. జయలలిత అండ్ బృందం దాఖలు చేసిన విచారణకు స్టే పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. అయితే, బెంగళూరు కోర్టు విచారణకు మాత్రం స్టే ఇవ్వడానికి బెంచ్ నిరాకరించింది. విచారణ తుది దశలో ఉన్న దృష్ట్యా, తాజాగా స్టే కోరడం బట్టి చూస్తే, కేవలం వాయిదాల మీద వాయిదాలతో కాలయాపనకు పరిస్థితి దారి తీయొచ్చని బెంచ్ అభిప్రాయ పడింది. విచారణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇచ్చే ప్రసక్తే లేదని బెంచ్ తేల్చడంతో జయలలితకు చుక్కెదురయ్యినట్టు అయింది.