అమ్మ పార్టీకే ఎసరు!
చెన్నై, సాక్షి ప్రతినిధి : కాలం కలిసి రాకుంటే తాడే పామై కరుస్తుందనేందుకు అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులే సాక్ష్యం. ఆ పార్టీ అధినేత్రి జయ జైలు పాలయ్యారు. దీంతో అసెంబ్లీ సభ్యత్వాన్ని తద్వారా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అంతర్జాతీయ స్థాయిలో పార్టీ మనుగడ చర్చనీయాంశమైంది. తాజాగా ఆ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలంటూ చెన్నై కి చెందిన సామాజిక కార్యకర్త ఁట్రాఫిక్‌రూ. రామస్వామి సుప్రీం కోర్టులో బుధవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
చెన్నై నగర వాసులకు ట్రాఫిక్ రామస్వామి పేరు చిరపరిచతమే. ముఖ్యంగా పార్టీ నేతలకు, పోలీసులకు ఆయనో అనధికార వీఐపీ. నగరంలో ట్రాఫిక్‌కు విఘాతం కలిగేలా ఎక్కడైనా ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తే అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సీఎంకు జేజేలు కొడుతూ నగరం నలుమూలలా ఫ్లెక్సీలు పెట్టడంలో ఆయా నేతల భక్తులు పోటీపడుతుంటారు. ప్రస్తుతం ఈ సంప్రదాయం అన్నాడీఎంకేలో కొనసాగుతోంది. అమ్మ వచ్చేపోయే దారైన పోయెస్ గార్డెన్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా సచివాలయం వరకు ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతుంటాయి. అమ్మ పేరు చెబితే అం దరూ హడలెత్తుతున్నా ట్రాఫిక్ రామస్వామి మాత్రం ఖాతరు చేయరు.
ఫ్లెక్సీలు తొలగిస్తేగానీ అక్కడి నుంచి లేవనని భీష్మించుకుని కూర్చుంటారు. నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులపై పోరాడడమే ఏకైక లక్ష్యం గా జీవించే సాధారణ సామాజిక కార్యక ర్త. ఈయన ఇప్పుడు ఏకంగా అన్నాడీఎంకే పార్టీపైనే గురిపెట్టడం చర్చనీయాంశమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత జైలు పాలు కావడం, పార్టీ నేతలు రాష్ట్రంలో విధ్వంసాలను కొనసాగించడం వల్ల అన్నాడీఎంకే గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు లో బుధవారం ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడి ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టించిన అన్నాడీఎంకే నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వ్యాజ్యంలో పేర్కొన్నారు. విధ్వంసకారులపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని సుప్రీం కోర్టుకు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు సాగించడం తీవ్ర అభ్యం తరకరమన్నారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. అంతేగాక అన్నాడీఎంకే నేతల అఘాయిత్యాలను కళ్లప్పగించి చూస్తున్న పోలీసు అధికారులపైనా చర్యలు చేపట్టాలని వ్యాజ్యంలో పేర్కొనడం గమనార్హం.