సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ భాగస్వామ్యంలోని శశి ఎంటర్ ప్రెజైస్ ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం ఏళ్ల తరబడి చెన్నై ఎగ్మూర్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
సాక్షి, చెన్నై: సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ భాగస్వామ్యంలోని శశి ఎంటర్ ప్రెజైస్ ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం ఏళ్ల తరబడి చెన్నై ఎగ్మూర్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నాలుగు నెలల్లో ముగించే విధంగా ఆ కోర్టు ముందుకెళుతోంది. అయితే, విచారణల పర్వం వాయిదాల మీద వాయిదాలతో సాగుతుండడంతో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కాస్త ముగింపు దశకు చేరింది.
29 వరకు బిజీ: విచారణ నిమిత్తం ఉదయం ఆర్థిక నేరాల కోర్టుకు జయలలిత, శశికళ హాజరవుతారన్న ప్రచారం సాగడంతో అక్కడ మీడియా హడావుడి మొదలైంది. అయితే, ఆ ఇద్దరూ రాలేదు. వారి తరపున వచ్చిన న్యాయవాదులు వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. సీఎం జయలలిత విచారణకు హాజరు కాలేరని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారంటూ అందులో వివరించారు. ఈ నెల 29 వరకు ఆమె బిజీ షెడ్యూల్‌ను ముందుగానే రూపొందించి ఉన్న దృష్ట్యా, కోర్టుకు హాజరయ్యే విషయమై మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే, శశికళ పంటి నొప్పితో బాధ పడుతున్నారని, ఆమెకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉన్నందున ఆమెకు కూడా మినహాయింపు కల్పించాలని కోరారు. ఆ ఇద్దరు డుమ్మా కొట్టడంతో విచారణ వాడి వేడిగా సాగింది.
ఉదయం కాసేపటి తర్వాత విచారణ వాయిదా పడగా, మళ్లీ మధ్యాహ్నం ఆరంభం అయింది. 40 నిమిషాల పాటుగా సాగిన విచారణలో జయలలిత, శశికళ, ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. చివరకు తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. ఆ రోజు జరిగే విచారణకు జయలలిత, శశికళ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించారు. తాను సంధించే ప్రశ్నలకు ఆ ఇద్దరు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ, ఒక వేళ ఆ తేదీ వాయిదా పడిన పక్షంలో జూలై మొదటి వారంలోపు కేసును తుది దశకు తీసుకెళ్లే విధంగా జస్టిస్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
జాప్యం : జయలలిత, శశికళ తరపున న్యాయవాదులు వాయిదాల మీద వాయిదాలను వేయించుకుంటూ ముందుకెళుతుండడాన్ని ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామి తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ఇది వరకు ఓ మారు కోర్టుకు రావాలని ఆదేశిస్తే, ఎన్నికలను సాకుగా చూపించడాన్ని ఇప్పటికే ఆయన తప్పుబట్టారు. ఆ సమయంలో ఇచ్చిన గడవు మేరకు సోమవారం విచారణకు జయలలిత, శశికళ హాజరు కావాల్సి ఉన్నా, ఆ ఇద్దరు డుమ్మా కొట్టడాన్ని కేవలం వాయిదాలతో జాప్యం చేస్తున్నారన్న అసహనాన్ని ఆయన వ్యక్తం చేయడం గమనార్హం.