సాక్షి, ముంబై: మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం కూలిన భవన ప్రమాద మృతుల సంఖ్య 54కు చేరుకుంది. 31 మంది గాయపడ్డారని బీఎంసీ విపత్తు నియంత్రణ అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు. ఈ భవనంలో నివసిస్తున్న సకాల్ మరాఠీ దినపత్రిక జర్నలిస్ట్ యోగేశ్ పవార్, అతడి తంఢ్రి అనంత్ పవార్ కూడా మరణించారని తెలిపారు. శుక్రవారం రోజు 13 మంది మృతదేహాలను వెలికితీసిన బీఎంసీ సిబ్బంది శనివారం మరో 37 మృతదేహాలను గుర్తించారు.
ఈ ఏడాదిలో జరిగిన రెండో పెద్ద భవన ప్రమాదం ఇదేనని తెలిపారు. ‘ఇంతకుముందు ముంబ్రా లక్కీ కాంపౌండ్‌లో ఏప్రిల్‌లో జరిగిన భవన ప్రమాదంలో 75 మంది మరణించారు. జూన్‌లో మహీమ్‌లో జరిగిన దుర్ఘటనలో పది మంది, ముంబ్రాలో పది మంది, దహిసర్‌లో ఏడుగురు, భివండీలో ముగ్గురు మృతి చెందార’ని వివరించారు. అయితే సహాయక చర్యల్లో ఇప్పటివరకు గాయపడని 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని చెప్పారు. వీరిలో అనిశ్ కదమ్ (10), దీప్తేశ్ కదమ్ (16), హబీబ్ షేక్ (22), తక్వీర్ షేక్ (22), హరూన్ షేక్ (24), అజయ్ చెంద్వంకర్ (40) ఉన్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నామన్నారు.
క్షతగాత్రులు జేజే ఆస్పత్రి, నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక అధికారి డీఎస్ పాటిల్ గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కుటుంబాలకు సమీపంలో ప్రత్యామ్నాయ వసతి కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. కాగా, దక్షిణ ముంబైలోని డాక్‌యార్డ్ సమీపంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగుల సిబ్బంది క్వార్టర్స్‌కు చెందిన ఈ భవనం 33 ఏళ్ల క్రితం కట్టిందని సీఎం కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 21 కుటుంబాలు నివసించే ఈ భవనం శుక్రవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా కూలిపోయిందని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో అందులో ఉండేవారు మంచి నిద్రలో ఉన్నారన్నారు. దీంతో ప్రాణనష్టం పెరిగిందని వివరించారు. 28 ఫ్లాట్‌లు ఉన్న ఈ భవనంలో ఏడు ఫ్లాట్‌లలో ఉండేందుకు వీలు లేదని, గ్రౌండ్ ఫ్లోర్ గిడ్డంగి తీవ్ర శిథిలావస్థకు చేరుకుందని కొన్నేళ్లక్రితం ప్రకటించిందన్నారు.
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మేయర్
కాగా, శనివారం నాటి సహాయక చర్యలను నగర మేయర్ సునీల్ ప్రభూ, ఉన్నత బీఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మున్సిపల్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యమందిస్తామని చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ అధికారులతో సమావేశమై సహాయక చర్యలను త్వరితగతిన చేపట్టేలా చొరవతీసుకోవాలని ఆదేశించారు. భవనం కూలిన ప్రాంతాన్ని శుక్రవారం రాత్రి సందర్శించి బాధితులను ఓదార్చారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కో మృతుని కుటుంబానికి రాష్ట్ర సర్కార్ తరఫున రూ.లక్ష నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
రెండు కమిటీల నియామకం..
ఈ భవన దుర్ఘటనపై విచారించేందుకు రెండు కమిటీలను బీఎంసీ నియమించింది. నగరంలో ఎన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, ప్రమాదకర స్థాయిలో ఉన్న వాటి వివరాలను కూడా ఈ కమిటీ సేకరిస్తుందని సంబంధిత అధికారి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై మళ్లీ సర్వే నిర్వహించడం, సాంకేతిక కారణాలు వెతకడం కోసం కార్పొరేషన్‌కు చెందిన ఇంజినీరింగ్ సేవా, ప్రణాళిక విభాగం డెరైక్టర్ లక్ష్మణ్ వట్కర్ అధ్యక్షతన ఒక కమిటీ, డిప్యూటీ కమిషనర్ రమేష్ పవార్ అధ్యక్షతన మరో కమిటీ పనిచేస్తుందన్నారు. కాగా, భవన గ్రౌండ్ ఫ్లోర్‌లో కొన్ని మార్పులు చేసిన మమామియాన్ డెకొరేటర్‌పై బీఎంసీ కేసు నమోదు చేసింది.
మరమ్మతుల్లో జాప్యమే కారణం...
మరమ్మతుల్లో జాప్యం జరగడమే భవనం కూలడానికి మరో కారణమని తెలిసింది. స్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల ఈ ఐదంతస్తుల భవనం నేలకూలిందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా 1980లో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకున్న జాబితాలో లేదని తెలిసింది. వాస్తవానికి బిల్డింగ్‌కు మరమ్మతు అవసరం ఉండటంతో బీఎంసీ సీ-2లో దీనిని పొందుపర్చారు. మరమ్మతుల కోసం కార్పొరేషన్ బడ్జెట్ నుంచి ఆర్థిక సహాయం కూడా అందించింది. భవ నం స్ట్రక్చర్ ఆడిట్ చేశారు. ఆ మేరకు మరమ్మతు ప్లానింగ్ కూడా చేసుకున్నారు. కానీ పనులు ప్రారంభించడంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. మరమ్మతు పనుల్లో జాప్యం జరగకపోతే దుర్ఘటన జరిగేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీ యజమాని అరెస్టు
బీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండానే గ్రౌండ్‌ఫ్లోర్‌లో మార్పులు చేసిన మమామియా డెకొరేటర్స్ యజమాని అశోక్ మెహతాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మార్పుల వల్లనే భవనం కూలిందని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎంసీ నుంచి భవనాన్ని లీజుకు తీసుకున్నాడని, అయితే భవన మరమ్మతుల గురించి అనుమతి తీసుకోలేదని ఆయన అందులో పేర్కొన్నారు. మెహతాతో పాటు అతని అనుచరులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండో ‘మహా’దుర్ఘటన
Published Sun, Sep 29 2013 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement