బృహన్ముంబై కార్పొరేషన్ క్వార్టర్స్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు పెరిగింది.
బృహన్ముంబై కార్పొరేషన్ క్వార్టర్స్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. ఈ దుర్ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. శిథిలాల కింద కనీసం మరో 12 మంది వరకు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని బీఎంసీ విపత్తు నివారణ విభాగం తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి గాయాలు లేకుండానే 20 మందిని కాపాడినట్లు తెలిపారు. శిథిలాల కింద తమకు తెలిసి 12 మందే ఉన్నా, తెలియకుండా మరింత మంది ఉండే అవకాశం ఉన్నందువల్ల యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.
దాదాపు 50 ఏళ్ల క్రితం కట్టిన ఈ భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే, శనివారం ఉదయానికి కూడా ఇంకా సహాయ చర్యలు పూర్తి కాలేదు. దుర్ఘటన జరిగే సమయానికి అందులో ఉండేవాళ్లంతా గాఢనిద్రలో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఈ భవనం బాగా పాడైందని నివేదిక వచ్చింది. ముంబై మేయర్ సునీల్ ప్రభు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులందరికీ ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సంఘటన స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మృతుల కుటుంబాలకు లక్షరూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.