దక్షిణ ముంబైలో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు.
దక్షిణ ముంబైలో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. నాలుగు అంతస్థులున్న ఈ భవనం శుక్రవారం ఉదయమే కూలిందని, సుమారు 50 మంది అందులో చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. వీరంతా శిథిలాలలో ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని కాపాడేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి.
దక్షిణ ముంబైలోని డాక్ యార్డు సమీపంలో ఉన్న ఈ భవనం ఉద్యోగుల నివాస భవనంగా ఉంది. దీన్ని సుమారు 50 ఏళ్ల క్రితం కట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో అది కుప్పకూలింది. ఆ సమయానికి ఇళ్లలో ఉన్న చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిపుణులు దీన్ని పరిశీలించి అత్యవసరంగా దీనికి మరమ్మతులు చేయాలని, కొన్ని కుటుంబాలను ఇక్కడినుంచి తరలించాలని తెలిపారు.
నాలుగు అంతస్థులలో కలిపి 28 ఫ్లాట్లు ఉన్నాయని, వీటిలో 22 ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నాయని, దాంతోపాటు గ్రౌండు ఫ్లోర్లో ఒక గోడౌన్ కూడా ఉందని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ముంబై మేయర్ సురేష్ ప్రభు తెలిపారు.