పత్రాల లీక్‌పై దర్యాప్తు చేయాలని కోరిన భారత్
న్యూఢిల్లీ : స్కార్పిన్ జలాంతర్గాముల రహస్య పత్రాల లీక్ వ్యవహారాన్ని ఫ్రాన్స్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మమెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు భారత నౌకాదళం గురువారం తెలిపింది. ఈ లీక్ వ్యవహారం తీవ్రతను గుర్తించి దర్యాప్తు చేయాలని ఫ్రాన్స్‌ను కోరింది. భద్రత విషయంలో రాజీపడలేదనడానికి అంతర్గత మ దింపు చర్యలు చేపట్టామని ఒక ప్రకటనలో భార త నౌకాదళం పేర్కొంది. ఆ పత్రాల లీక్ విదేశా ల నుంచే జరిగిందని నొక్కి చెప్పింది. ఆస్ట్రేలియ న్ న్యూస్ ఏజెన్సీ వెబ్‌సైట్లో పెట్టిన పత్రాలు పరిశీలించగా.. భద్రతలో రాజీపడినట్లు ఏమీలేదని పేర్కొంది.
లీక్ అయినట్లు చెబుతున్న 22,400 పేపర్లలో కొన్నింటిని మాత్రమే ఆస్ట్రేలియన్ పత్రిక బయటపెట్టింది. సున్నితమైన రహస్య సమాచారం బహిర్గతమైనట్లు వచ్చిన వార్తల ప్రామాణికత ఎంత అనేది దౌత్య మార్గాల ద్వారా సంబంధిత దేశాల నుంచి తెలుసుకుంటామని భారత నేవీ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖ, నేవీ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా భద్రతా రాజీ వ్యవహారం ఏమైనా బహిర్గతమైతే దాని ప్రభావం తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో నేవీ పేర్కొంది.
వరుస సమావేశాలు..
లీకేజీ తర్వాత రక్షణ శాఖలో వరస సమావేశాలు జరుగుతున్నాయి. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ, ఇతర అధికారులు రక్షణ మంత్రి పరీకర్‌కు తాజా సమాచారం చేరవేస్తున్నారు. లీక్‌ల నిగ్గు తేల్చడానికి అవసరమైతే విదేశాలకు ఒక బృందాన్ని పంపనున్నారు.
మరిన్ని లీకేజీ పత్రాలు విడుదల
స్కార్పిన్ నిర్మాణం, వ్యవస్థకు సంబంధించిన మరిన్ని లీకేజీ డాక్యుమెంట్లను ‘ద ఆస్ట్రేలియన్’ పత్రిక గురువారం విడుదల చేసింది. భారత నౌకాదళ ముద్రతో ఉన్న డాక్యుమెంట్లు వీటిలో ఉన్నాయి. లీకేజీతో భారత తీరప్రాంత భద్రత ప్రమాదంలో ఉందని వెల్లడించింది. కాగా, దేశ భద్రత విషయంలో రాజీపడేంత విషయమేమీ లేదని.. నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నేవీ వెబ్‌సైట్లలో ఉన్న వాటినే ఆస్ట్రేలియన్ పత్రిక ప్రచురించిందన్నారు.