సాక్షి, ముంబై: పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిందని సామెతను గుర్తు చేస్తున్నాయి శివసేన, ఎమ్మెన్నెస్ రాజకీయాలు. వీరిద్దరి మధ్య విభేదాలు ఇతరపార్టీల విజయానికి తోడ్పడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల తీవ్రతను బట్టి 2009 ఎన్నికల్లో ఎదురైన పరిస్థితే మళ్లీ ఇప్పుడు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి చెందిన అనేక విమర్శించే అంశాలు ఉన్నప్పటికీ ఉద్ధవ్ కేవలం రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని బహిరంగసభల్లో ఆరోపణలు చేస్తున్నారు. ఇదే బాటలో రాజ్ కూడా నడుస్తున్నారు. అప్పుడప్పుడు ఉద్ధవ్‌పై నేరుగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా రాజ్ ఆరోపిస్తూనే ఉన్నారు. ఉద్ధవ్ విసిరిన సవాళ్లకు రాజ్ కూడా దీటుగా సమాధానమిస్తున్నారు.
2009లో కూడా ఇదే జరిగింది.. అప్పుడు జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఉద్ధవ్, రాజ్ సోదరుల మధ్య నెలకొన్న వివాదం కాషాయ కూటమి కొంపముంచింది. కాంగ్రెస్, ఎన్సీపీ విజయానికి పరోక్షంగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సభలు జోరుగా సాగుతున్నాయి. కాని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఉద్ధవ్ తమ పార్టీ లక్ష్యాలను, ప్రచార ఆయుధాలను వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసి లక్షల ఓట్లను చేజిక్కించుకున్న ఎమ్మెన్నెస్ ఈసారీ 13 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇందులోని 11 నియోజక వర్గాల్లో ఎమ్మెన్నెస్ కారణంగా శివసేనకు గట్టి దెబ్బ తగిలే అవకాశాలున్నాయి. ఎమ్మెన్నెస్ టికెట్‌పై దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి బాలా నాంద్‌గావ్కర్, ద క్షిణ మధ్య ముంబై-ఆదిత్య శిరోడ్కర్, వాయవ్య ముంబై-మహేశ్ మాంజ్రేకర్, కల్యాణ్-రాజు పాటిల్, నాసిక్-ప్రదీప్ పవార్, పుణే-దీపక్ పాయ్‌గుడే, శిరూర్-అశోక్ ఖాండేభరాడ్, ఠాణే-అభిజీత్ ఫణసే, భివండీ-సురేశ్ అలియాస్ బాల్యమామ మాత్రే, వాషిం-యవత్మాల్ నుంచి రాజు పాటిల్ రాజే పోటీ చేస్తున్నారు. మరికొంత మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కారణంగా ఓట్లు చీలిపోయి కాషాయ కూటమికి గట్టి దెబ్బ తగిలింది.
ముఖ్యంగా శివసేన ఓట్లు చీలిపోయాయి. దీంతో ఎమ్మెన్నెస్‌ను కాషాయకూటమితో పొత్తుపెట్టుకునేలా బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాని ఉద్ధవ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ఈసారి ఎమ్మెన్నెస్ బరిలో దింపిన నియోజకవర్గాల్లో జాల్నా, పుణే, భివండీ మినహా మిగతావన్ని శివసేనకు అనుకూలంగా ఉన్నాయి. కాని ఎమ్మెన్నెస్ అభ్యర్థులవల్ల ఓట్లు చీలిపోయి 2009 ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలున్నాయి.
పవార్ గెలుపు రహస్యం ఇదా: ఉద్ధవ్
నాసిక్: ‘ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ వరుస విజయాల వెనుక రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది. కార్యకర్తలకు రెండేసి ఓట్లు వేయాలని చెప్పి తన వరుస విజయాల వెనుక రహస్యాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు..’ అని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నాసిక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
‘నవీముంబైలో ఆదివారం జరిగిన ఎన్సీపీ ర్యాలీలో ఆ పార్టీ అధినేత శరద్‌పవార్ ప్రసంగాన్ని విన్నాను. విడతల వారీ ఎన్నికల నేపథ్యంలో పనిచేస్తున్న ముంబైలోనూ, తమ సొంత ఊళ్లలోనూ రెండు సార్లు ఓటేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. దీన్నిబట్టి ఆయన పార్టీ ఇన్నాళ్లుగా ఎన్నికల్లో ఎలా గెలుస్తోందీ అర్థమవుతోంది..’ అని ఉద్ధవ్ విమర్శించారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో శివసేన పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తమ పార్టీ తరఫున షిరిడీ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న బబన్‌రావ్ ఘోలప్‌ను అక్రమ ఆస్తుల కేసులో కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో అతడి కుమారుడు యోగేష్ ఘోలప్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాలు పేర్కొన్నాయి.
పిట్టల‘పోరు’..
Published Mon, Mar 24 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement