అన్నీ సుడిగుండాలే!
♦ నిన్నటి వరకు పొగడ్తలు
♦ నేడు తిట్ల పురాణం
♦ టీటీవీకి అన్నీ కష్టాలే
♦ ఇక కోర్టుల చుట్టూ ప్రదక్షణలే
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఏ క్షణాన పగ్గాలు చేపట్టాడో ఏమోగానీ, అడుగడుగునా సుడిగుండాల్ని దాటాల్సిన పరిస్థితి దినకరన్‌కు తప్పలేదు. నిన్నమొన్నటి వరకు పొగడ్తల పన్నీరులో ముంచిన వాళ్లు, నేడు తిట్ల పురాణం అందుకోవడం టీటీవీకి పెద్ద షాక్కే. రెండు నెలల వ్యవధిలో అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కోర్టుల చుట్టూ తిరగక తప్పదేమో..!
సాక్షి, చెన్నై :
అన్నాడీఎంకే వర్గాలు అమ్మ జయలలిత బతికే ఉన్నప్పుడు నెచ్చెలి శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే విదేశీ మారక ద్రవ్యంతో పాటు మరికొన్ని కేసులు దినకరన్ మెడకు వేలాడుతున్నా, విచారణల వేగం మాత్రం వాయిదాల పర్వంతో సాఫీగా సాగుతూ వచ్చాయి. అమ్మ ఉన్నంత కాలం పోయెస్ గార్డెన్ వైపుగానీ, పార్టీ కార్యాలయం వైపుగానీ కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఆ అమ్మ మరణంతో పోయెస్‌గార్డెన్‌లో తిష్ట వేయడమే కాదు, చిన్నమ్మ శశికళ ఆశీస్సులతో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు.
చిన్నమ్మ ప్రతినిధిగా పార్టీని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకునేందుకు తగ్గ అస్త్రాలతో దినకరన్ ముందుకు సాగారని చెప్పవచ్చు. పార్టీ పదవికి చేతికి చిక్కిన వారం రోజుల అనంతరం ఫిబ్రవరి 23వ తేదీ అధికారికంగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో టీటీవీ జై...అంటూ పొగడ్తల పన్నీరు చల్లేందుకు ఆ కార్యాలయం వైపుగా పోటేత్తిన సేనలు కోకొల్లలు. కాళ్ల మీద ఆశ్వీరచనాలు తీసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, అమ్మ తరహాలో కార్యాలయం మీద నుంచి విక్టరీ చిహ్నం చూపించడం ఏమిటో, తానే ఇక అన్నాడీఎంకేకు భవిష్యత్తు అన్నట్టుగా ఠీవీని ప్రదర్శించారని చెప్పవచ్చు.
అన్నీ సుడిగుండాలే : ఏ ముహూర్తాన ఆ పదవిలో దినకరన్ కూర్చున్నారో ఏమోగానీ వరుస గండాలు, సుడిగుండాల్ని దాటక తప్పలేదు. జయలలిత మేనల్లుడు దీపక్ ఆయనకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నా, మాజీ సీఎం పన్నీరు రూపంలో చిక్కులు ఎదురైనా అన్నింటినీ అడ్డుకునేందుకు వీరోచితంగా శ్రమించక తప్పలేదు. ఓ వైపు తన పట్టు పార్టీలో బిగిసే రీతిలో నేతలతో మంతనాలు, అసంతృప్తి వాదులకు బుజ్జగింపులు ఇలా నిత్యం రాయపేట కార్యాలయంలో ఉంటూ తన సత్తాను చాటుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఆర్కేనగర్‌లో గెలుపుతో సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నంతగా ఎదిగిన దినకరన్‌ను ఒక్కసారిగా పాత, కొత్త సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు.
ఇక కోర్టు చుట్టూ ప్రదక్షిణలేనా: ఆర్కేనగర్ రూపంలో కష్టాలు మరింతగా చుట్టుముట్టడంతో సాగిన పరిణామాలు ప్రస్తుతం టీటీవీకి కష్టాలను కొని తెచ్చిపెట్టారు. ఓ వైపు విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ వేగవంతం కావడం, కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితుల నేపథ్యంలో రెండాకుల చిహ్నం కోసం సాగిన లంచం వ్యవహారం మెడకు బిగుసుకోవడంతో ఇక కేసుల ఊబిలో కూరుకు పోయినట్టు పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నిన్న మొన్నటి వరకు పొగడ్తల పన్నీరు చల్లిన వాళ్లు, ప్రస్తుతం తిట్ల పురాణంతో తప్పుకో...అంటూనే, తప్పించేశాం...ఇక కార్యాలయం వైపుగా అడుగులు కూడా పెట్టొదంటూ హెచ్చరికలు చేసే పనిలో పడడం గమనార్హం.
ఇప్పటికే పాస్‌పోర్టు సీజ్ చేయబడి ఉన్నా, తాజా పరిణామాల నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా వాంటెడ్ లిస్టులో ఆయన పేరు ఎక్కడం, ఎగ్మూర్ కోర్టు మెట్లు ఎక్కడం అన్నీ ఒకే రోజు జరిగి పోవడంతో గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మున్ముందు దినకరన్ పరిస్థితి ముందు గొయ్యి...వెనక నొయ్యి అన్నట్టుగా ఉంటుందేమోనని ఎద్దేవా చేసే వాళ్లూ పెరుగుతున్నారు. మొన్నటి వరకు కేడర్ మధ్యలో ఠీవీగా నడిచిన దినకరన్ ఇక, న్యాయవాదులు, పోలీసులు నడుమ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదేమో..!. ఇందుకు అద్దం పట్టే రీతిలో బుధవారం ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఎగ్మూర్ కోర్టు విచారణకు తన న్యాయవాదులతో కలిసి అడుగు పెట్టారు. ఇక, తన బలాన్ని చాటుకునే విధంగా పార్టీ కార్యాలయంలో సమావేశానికి సిద్ధ పడ్డా, అడుగు పెట్ట వద్దంటూ వచ్చిన హెచ్చరికతో గౌరవంగానే తప్పుకుంటున్నా..అన్నట్టు మీడియా ముందుకు వ్యాఖ్యలు వళ్లించడం బట్టి చూస్తే, కొన్ని సామెతులు గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుందేమో..!