చిన్నమ్మ ఆనందం
► చప్పట్లతో హర్షం
► చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ కసరత్తు
► కోర్టులో పిటిషన్ కు నిర్ణయం
అధికారం తమ గుప్పెట్లోకి రావడంతో చిన్నమ్మ శశికళ ఆనందానికి అవధులు లేవు. పరప్పన అగ్రహార చెరలో చప్పట్లు మార్మోగించి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన విధేయుడి చేతికి అధికారం చిక్కడంతో, జైలు నుంచే వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుంది. ఇక, చిన్నమ్మ చెన్నై చెరకు మార్చకుండా అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించింది.
సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెరలో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శనివారం మధ్యాహ్నం భోజ నాన్ని సైతం మరిచారు. ఇందుకు కారణం టీవీ ముందుకు అతుక్కు పోవడమే. అసెంబ్లీ వ్యవహారాలను టీవీలో వీక్షించిన శశికళ మధ్యాహ్న భోజన సమయాన్ని సైతం పట్టించుకోలేదని సమాచారం. తన విధేయుడు పళనిస్వామి చేతికి అధికార పగ్గాలు చిక్కడం, తన శపథాన్ని నెరవేర్చానని ఉప ప్రధానకార్యదర్శి దినకరన్ వ్యాఖ్యానించిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేవని తెలి సింది. టీవీ ముందు నుంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టి మరీ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక, జైలు నుంచి తమిళ ప్రభుత్వ చక్రం తిప్పేందుకు తగ్గ వ్యూహాన్ని రచించేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. అలాగే, పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడుకు తనను మార్చే విధంగా త్వరితగతిన చర్యల్ని వేగవంతం చేయాలని న్యాయవాదులకు ఆమె సూచించి నట్టు తెలిసింది. ఈ విషయంగా న్యాయవాదులతో టీటీ వీ దినకరన్ సంప్రదింపులు జరుపుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేయించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, చెర మార్పును అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించడంతో వ్యతిరేకత బయలు దేరినట్టు అయింది.
చెర మార్పునకు వ్యతిరేకత: తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం కార్యవర్గం ఆదివారం జరిగింది. ఇందులో అవి నీతికి వ్యతిరేకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా శశికళకు వ్యతిరేకంగా ఇందులో నిర్ణయాలు తీసుకున్నారు. శశికళను చెన్నై జైలుకు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు తీర్మానించారు. కర్ణాటక కోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయడానికి తిరుప్పూర్ జిల్లా విభాగం కన్వీనర్ సుందర పాండియన్ నిర్ణయించారు. ఆమెను ఇక్కడకు మార్చిన పక్షంలో, రాష్ట్రంలో మరింత అవినీతి, దోపిడీ పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, సీఎంతో పాటు మంత్రులు జైలు ముందు ప్రతి రోజూ బారులు తీరే అవకాశం ఉంద న్న విషయాన్ని ఎత్తి చూపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన వివరించారు.