- అర్థం కాక బిక్క మొహం వేస్తున్న మైనార్టీ భాషల ప్రజలు
హొసూరు, న్యూస్‌లైన్ : కృష్ణగిరి జిల్లాలో ప్రభుత్వ పథకాల తీరు నేల విడిచి సాము చేసే చందంలా తయారైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమిళంలో ప్రచారం చేస్తుండడంతో కన్నడ భాషా ప్రజలకు అర్థం కావడం లేదు. దీంతో వాటి ఫలాలు ప్రజలకు చేరక పోగా, కొన్ని పథకాల నిధులు దుర్వినియోగం అవుతుండడంతో పాటు నిరుపయోగమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హొసూరు, డెంకణీకోట, కృష్ణగిరి తాలూకాలలో తెలుగు, కన్నడ భాషా ప్రజలు ఎక్కువ. ఇక్కడ నివసించే వారిలో 80 శాతం మందికి తమిళం తెలియదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాన నీటి సేకరణ పథకం అమలుకు ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించి వర్షపు నీటి సేకరణ పనులు చేపట్టి భూగర్భ జల వనరుల పెంపునకు కృషి చేయాలని సీఎం సూచించారు.
దీంతో కలెక్టర్ టీపీ.రాజేష్ వెంటనే స్పందించి పాఠశాల విద్యార్థులతో ఊరేగింపులు, కలెక్టర్ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో 20 చోట్ల, పట్టణ పంచాయతీల్లో 15 చోట్ల ఫెక్సీలు ఏర్పాటు చేయాలని, వాన నీటి సేకరణపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అధికారులు కూడా.. జీ హుజూర్.. అంటూ కూడా తలలు ఊపి తమిళ అక్షరాలతో అందంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పట్టణ పంచాయతీల్లోని తెలుగు, కన్నడ ప్రజలు వీటిని చూసి ఏమీ అర్థంకాక తెల్లముఖం వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లాలంటే ప్రజల భాషల్లో ప్రచారం చేయాలని సమీక్షా సమావేశాల్లో అధికారులు తెలిపాలి లేదా, జిల్లా కలెక్టర్ ఆలోచించి నిర్ణయించాల్సి ఉంది.
ఈ విషయంపై తెలుగు సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షుడు ఎంఎస్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లను తెలుగు, కన్నడ భాషల్లో ముద్రించి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం, ప్రభుత్వ పథకాల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. అధికారులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పని చేయాలని, ప్రజల కోసం పని చేయాలని ఆయన సూచించారు.