
సీనియర్ హాస్య నటి బిందు ఘోష్ ఇక లేరు. ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని స్వగృహంలో కన్నుమూశారు . ఈమె వయసు 76 ఏళ్లు. ఈమె అసలు పేరు విమల. 1981లో గ్రూప్ డాన్సర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె నృత్య దర్శకుడు కన్నప్పన్ వద్ద డాన్సర్‌గా పనిచేశారు. అలా తమిళ్‌లో కలతూర్ కన్నమ్మ చిత్రంలో నటుడు కమలహాసన్‌తో కలిసి డాన్స్ చేశారు. ఆ తర్వాత కోళి కూవుదు చిత్రం ద్వారా నటిగా మారిన బిందు ఘోష్ పలురకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కమల్ హాసన్ రజనీకాంత్ ప్రభు, విజయ్ కాంత్, కార్తీక్ తదితర ప్రముఖ నటుల చిత్రాల్లో నటించారు.
తెలుగులో దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం తదితర చిత్రాల్లో నటించారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. కాగా స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తున్న బిందు గోష్ వృద్ధాప్యంలో పలు రకాల సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేక అవస్థలు పడ్డారు. కాగా చైన్నెలోని విరుగంబాక్కంలో నివశిస్తున్న సింధు ఘోష్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బిందు ఘోష్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమార్తెలు తెలిపారు.
రెండురోజుల క్రితమే ఆమె గురించి ఇలా మాట్లాడిన కుమారుడు
తల్లి అనారోగ్య పరిస్థితి గురించి తనయుడు, కొరియోగ్రాఫర్ శివాజీ కొద్దిరోజుల క్రితమే మీడియాతో పంచుకున్నాడు. 'అమ్మకు 76 ఏళ్లు. ఒకప్పుడు 118 కిలోల బరువుండేది. అనారోగ్యం వల్ల ఏకంగా 38 కిలోలకు తగ్గిపోయింది. ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అమ్మ సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయింది. అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం స్పందించి అమ్మకు చికిత్స అందిస్తోంది' అని గతంలో ఆయన పేర్కొన్నాడు. ఇంతలోనే ఆమె మరణించారనే వార్త తెలియడంతో అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment