మీకు నిధులు ఎక్కడివి?
Published Sun, Nov 10 2013 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పేర్కొంటూ అధికారంలోకి రావడానికి కృషిచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని చూస్తున్న ‘ఆప్’నకు అసలు తమ పార్టీని విమర్శించే అర్హత ఉందా అని ఆమె అన్నారు. అసలు మీకు ఎక్కడ నుంచి నిధులు వస్తున్నాయో వాస్తవాలు చెప్పాలని ఆమె ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు. ‘మీరు నన్ను అబద్ధాలకోరు అంటున్నారు.. నేను మిమ్నల్ని దొంగ అంటున్నాను. నేను నిజంగానే అబద్ధాలకోరునని నిరూపించడానికి మీ వద్ద సాక్ష్యాలేమైనా ఉన్నాయా.. లేదా మీరు దొంగలు అని నిరూపించడానికి నా వద్ద సాక్ష్యాలేమైనా ఉన్నాయా..
కేవలం ఆరోపణలతో ఎవరినీ అవినీతిపరుడిగా, దోషిగా నిరూపించలేం కదా... మనమందరం అద్దాల మేడల్లో ఉన్నవారమేననే విషయం మీరు గుర్తుంచుకోవాలి..’ అంటూ ఆమె ఆప్ నాయకులను హెచ్చరించారు.తమ ప్రభుత్వంపై ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ..‘ఎక్కడైనా ఎన్నికల యుద్ధం అనేది ఆయా పార్టీల పరిపాలనా విధానాలపై, లక్ష్యాలపై ఉండాలి తప్పితే వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలతో ముందడుగు వేయలేం.. అసలు మీ విధానాలేమిటి.. మీరు దేనిగురించి యుద్ధం చేస్తున్నారు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు..’ అంటూ ఆమె కేజ్రీవాల్ ప్రభృతులను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా షీలాదీక్షిత్, ఆమె సహచరులపైనే ఆప్ ముఖ్యంగా దృష్టిపెట్టింది. షీలా సర్కారు అవినీతిపైనే ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తూ ఆమెను చికాకు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆప్ సేకరించిన నిధుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని గత నెల ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తమ నిధుల సేకరణపై వచ్చిన ఆరోపణలను ఆప్ నాయకులు ఖండించారు. తమ పార్టీ వెబ్‌సైట్‌లో చందాల వివరాలన్నీ ఉన్నాయని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని చెప్పారు. కాగా రాజకీయ పార్టీగా ‘ఆప్’ విశ్వసనీయతను షీలాదీక్షిత్ ప్రశ్నించారు. ఆమె మాట్లాడు తూ..‘ రాజకీయ పార్టీలంటే విధి విధానాలు ఉండాలి. ఆయా పార్టీల కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన తప్పకుండా ఉండాలి. సదరు పార్టీలు ఏ విధానాలపై నిలబడుతున్నాయో ప్రజలకు తెలియాలి. ఢిల్లీలో బీజేపీకి కొం త చరిత్ర ఉంది. మేము 15 ఏళ్లుగా నగరంలో పరిపాలన కొనసాగిస్తున్నాం. మరి మీ (ఆప్) సంగతి ఏంటి.. మీకు ఎటువంటి చరిత్రా లేదు.. అంటూ వ్యంగ్యంగా అన్నారు. ‘ఆప్’ గెలుపోటములపై తాను మాట్లాడబోనన్నారు. ఈసారి పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యేనని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, ఆప్ తగినన్ని సీట్లు గెలుచుకుంటుందని వస్తున్న ఎన్నికల సర్వేలపై ప్రశ్నించగా ఆమె తేలిగ్గా తీసిపారేశారు. ఆ సర్వేలు నిష్పక్షపాతంగా జరగలేదని, వాటిని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన పనిలేదని ఆమె తేల్చేశారు. ‘ సదరు సర్వేలన్నీ ఆయా పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను, మేనిఫెస్టోలను విడుదల చేయకముందు నిర్వహించినవి.. ఇప్పుడు వాస్తవ పరిస్థితులను ఆ సర్వేలు ప్రతిఫలించడంలేదు.. ఏదేమైనా మేం నాలుగవ పర్యాయం కూడా అధికారంలోకి వస్తామనే విశ్వాసం మాకుంది..’ అని ఆమె ముక్తాయించారు. ఇదిలా ఉండగా, ఆప్ నాయకులు మాట్లాడుతూ తాము రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 వేల మంది పార్టీ మద్దతుదారుల నుంచి నవంబర్ 8వ తేదీవరకు రూ.19 కోట్లు పార్టీ ఫండ్‌గా సేకరించామని తెలిపారు. ఎన్నికలో తమ పార్టీ ఖర్చుల నిమిత్తం రిక్షా వాలాల దగ్గరనుంచి, చిరువ్యాపారులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు రూ. 10 నుంచి రూ.లక్షల్లో తాము ఈ చందాలు వసూలుచేసినట్లు వారు వివరించారు.
Advertisement
Advertisement