షీలాదీక్షిత్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ ప్రథమ పౌరురాలి పదవికి రాజీనామా చే సిన నేపథ్యంలో ఈ తరహా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలు షీలాకి అప్పగించాలంటూ ఇప్పటికే కొందరు నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి విన్నవించారు. షీలా మద్దతుదారులు ఇదే ఆశిస్తున్నప్పటికీ... వ్యతిరేకులు మాత్రం ఆమె ఒంటెత్తు పోకడవల్లనే గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైందని వాదిస్తున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ:కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో షీలాదీక్షిత్ రాజకీయ భవితవ్యంపై ఊహా గానాలు మొదలయ్యాయి. ఇప్పుడే కాకపోయినప్పటికీ కొంతకాలం పోయిన తరువాతైనా షీలాదీక్షిత్ ఢిల్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని అంటున్నారు. త్వరలో ఢిల్లీ విధానసభ ఎన్నికలు జరుగుతాయనే అంచనాల నేపథ్యంలో ఆమె పునరాగమనం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలను షీలాదీక్షిత్ చేపట్టాలని ఆమె మద్దతుదారులు గట్టిగా కోరుతున్నారు. రాజధానిలో డీలాపడిన కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలిగిన సామర్థ్యం షీలాదీక్షిత్‌కు మాత్రమే ఉందని వారంటున్నారు. ఈ విషయాన్ని మతీన్ అహ్మద్‌తో పాటు కొందరు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇటీవల సోనియా గాంధీకికూడా విన్నవించారు. మరోవైపు షీలాదీక్షిత్ రాకను కూడా మరికొందరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
షీలాదీక్షిత్ నేతృత్వంలో కాంగ్రె స్ ఘోర ఓటమి పాలు కావడంతోపాటు ఆమె కూడా పరాజయం పాలైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. నగరంలో కాంగ్రెస్ దుస్థితికి షీలాదీక్షిత్ ఒంటెత్తు పోకడే కారణమని, ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవడం అటుంచి రెండు గ్రూపులుగా విడిపోవడం ఖాయమని వారంటున్నారు. అయితే షీలాదీక్షిత్ మద్దతుదారులు మాత్రం గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయబోరని అందరినీ ఒక్కతాటికి తీసుకొచ్చి ముందుకు సాగుతారని అంటున్నారు.కాంగ్రెస్‌లో విబేధాల సంగతి ఏవిధంగా ఉన్నప్పటికీ ఒకవేల షీలాదీక్షిత్ కనుక మళ్లీ ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర చేపడితే దానిని బీజేపీ తేలిగ్గా తీసుకోబోదని, ఆమెపై కామన్వెల్త్ క్రీడ లకు సంబంధించిన ఆరోపణలు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అవకతవకల ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లు తిరిగి తెరచుకోవడం ఖాయమని కొందరు అంటున్నారు.
ఈ ఆరోపణల దర్యాప్తు నుంచి రక్షించడానికే అప్పట్లో షీలాదీక్షిత్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టారని వారు వాదిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలలో పస లేదని, ఈ ఆరోపణలపై దర్యాప్తుకు సిద్ధపడి నిజాయితీపరురాలనే ముద్రతో ప్రజల ముందుకు రావచ్చని సన్నిహితంగా ఉండే నేతలు కొందరు షీలాదీక్షిత్‌కు సలహా ఇస్తున్నారని అంటున్నారు. షీలాదీక్షిత్ కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలు, ఆమె సామర్థ్యంపై కాంగ్రెస్ అధిష్టానానికి అపార నమ్మకం ఉంది. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఆమె స్థానం చెక్కుచెదరలేదు. ఇప్పుడు కూడా అధిష్టానం షీలాదీక్షిత్ ఆమెకు పెద్దపీట వేస్తుందని, అది జాతీయ స్థాయిలోనా లేక ఢిల్లీ స్థాయిలోనా అనే విషయం వేచి చూడాల్సిన విషయమని కొందరు అంటున్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.
అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీ దళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
భవితవ్యమేమిటో?
Published Wed, Aug 27 2014 10:40 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement