ప్రలోభాలు
- అభ్యర్థుల గెలుపు కోసం ఇరు పార్టీల అడ్డదారి
- మూడు స్థానాల్లోనూ 40 శాతం పెరిగిన మద్యం విక్రయాలు
- క్రీడా సామగ్రి, చీరలు, ముక్కు పుడకల ఎర
- గెలుపుపై కమలనాథుల ధీమా
- గెలిచి తీరాలంటున్న కాంగ్రెస్
సాక్షి, బెంగళూరు : ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేచింది. గెలుపుపై కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తుండగా ఎలాగైనా గెలిచి తీరాలంటూ కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఓటరు మహాశయులను మచ్చిక చేసుకునేందుకు ఇరు పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం పోటీపడ్డారు. శికారిపుర, చిక్కొడి-సదలగ, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల్లో బహిరంగ ప్రచారానికి మంగళవారం ఐదు గంటలకు తెరపడింది.
ఈ నెల 21న పోలింగ్ ప్రక్రియ ఉండడంతో అంతకు ముందే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. యువ ఓటర్లను ఆకర్షించేందుకు వారికి క్రీడా సామగ్రిని అందించారు. మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు చీరలు ముక్కు పుడకలను పంచారు. ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజకవర్గాలోనూ ఈ వారం రోజుల్లో మద్యం అమ్మకాలు సాధారణం కంటే 40 శాతం పెరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.