తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి బంగారప్పను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించివేసి, ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీపై నిరంతర పోరాటం
శివమొగ్గ,న్యూస్‌లైన్ : తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి బంగారప్పను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించివేసి, ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీపై నిరంతర పోరాటం చేస్తానని రాష్ట్ర జేడీఎస్ యువవిభాగం అధ్యక్షుడు సొరబ ఎమ్మెల్యే మధు బంగారప్ప స్పష్టం చేశారు.
శనివారం నగరంలోని జేడీఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధు బంగారప్ప మాట్లాడుతూ... తన తండ్రి పట్ల వ్యవహరించిన కుట్రను బయటపెడతానని చెప్పారు. సీబీఐ కోర్టు కూడా బంగారప్ప నిర్ధోషి అని తెలిపిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోర్టు తన తీర్పులో బంగారప్పకు వ్యతిరేకంగా అప్పటి ప్రధానమంత్రి పీవీ.నరసింహరావు, వీరప్పమొయిలీ, మార్గరే ట్ అళ్వా కుట్ర రాజకీయాలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు.
ఇంతటి కుట్రకు పాల్పడిన మార్గరేట్ అళ్వా, వీరప్పమొయిలీ అధికారంలో ఉండటం సిగ్గు చేటని మధు బంగారప్ప దుయ్యబట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ, కోస్తా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బంగారప్పకు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు. యడ్యూరప్ప అవినీతి అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఎంపీగా ఎన్నికైన బీవై.రాఘవేంద్ర బంగారప్పను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. మొదట తండ్రి, కొడుకు ఏ పార్టీలో చేరాలో ఎవరు లోక్‌సభ కు పోటీ చేయాలో కూర్చుని నిర్ణయించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.