‘ఇంత దరిద్రమైన పాలన ఎప్పుడూ లేదు’
మైసూరు: కర్ణాటకలో అనేక మంది ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాను కాని ఇలా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని మాజీ సీఎం, బీజేపీ నేత ఎస్‌ఎం కృష్ణ అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎటువంటి లక్ష్యం, ముందుచూపు లేవని విమర్శించారు. సోమవారం మైసూరు జిల్లా నంజనగూడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూస్తుంటే ప్రజల కోసం రోజు 24 గంటలూ పనిచేసేలా లేదని అన్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చి సాయంత్రం మళ్లీ తాళం వేసుకుని వెళ్లేలా ఉందని ఎద్దేవా చేశారు. నేను చూసిన అతి దరిద్రమైన పరిపాలన, ప్రభుత్వం సిద్ధరామయ్యదే అని విమర్శించారు. తన ఐదున్నరేళ్ల రాజకీయ జీవితంలో ఇంత అధ్వాన్న ప్రభుత్వాన్ని చూడలేదని ధ్వజమెత్తారు. ఆయన పరిపాలన చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదీ అని వెతుక్కునే పరిస్థితి ఉందన్నారు. మీడియా కూడా కాంగ్రెస్ పార్టీవారికి సహకరించాలని చమత్కరించారు. తాను ఎలాంటి ఆశలు పెట్టుకుని బీజేపీలోకి రాలేదని చెప్పుకొచ్చారు.
బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్‌ఎం కృష్ణ రాష్ట్ర పారిశ్రామిక మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎస్‌ఎం కృçష్ణను కలువడానికి వెళ్ళానని అన్నారు. మైసూరు నగరంలో ఉన్న జలదర్శిని గెస్ట్‌హౌస్‌కు వెళ్ళి ఆయన కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయని అన్నారు. అలాంటి నేత రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బీజేపీ నాయకులు పెద్దసంఖ్యలో వచ్చి రైల్వేస్టేషన్‌లో కృష్ణకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గుండ్లుపేట వెళ్లారు. అక్కడ కూడా ప్రచారసభల్లో పాల్గొన్నారు.