బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్లు ఇద్దరు తొలిసారి కౌన్సిలర్లే | Son of a sanitation worker occupies highest chair in South corpn | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్లు ఇద్దరు తొలిసారి కౌన్సిలర్లే

Published Wed, May 7 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

Son of a sanitation worker occupies highest chair in South corpn

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని మూడు కార్పొరేషన్లకు మేయర్‌లుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వారిలో ఉత్తర ఢిల్లీ మేయర్ చందోలియా మినహా మిగతా ఇద్దరు కౌన్సిలర్లుగా తొలిసారి ఎన్నికైనవారే. వారం క్రితం ఈ మూడు కార్పొరేషన్లు కొత్త మేయర్లను ఎన్నుకున్నాయి. ఉత్తర ఢిల్లీ  మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా యోగేంద్ర చందోలియా, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మీనాక్షి, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరే షన్ మేయర్‌గా ఖుషీ రామ్‌చునార్ ఎన్నికయ్యారు. ముగ్గురు మేయర్లు బీజేపీకి చెందినవారే. మూడుసార్లు మూడు మున్సిపల్  కార్పొరేషన్ల మేయర్ పదవులను దక్కించుకున్న బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. తూర్పు ఢిల్లీ  మేయర్ మీనాక్షి ఢిల్లీకి ఇప్పటివరకు మేయర్‌లు అయిన వారందరి కంటే పిన్న వయస్కురాలు.
 
 33 ఏళ్ల మీనాక్షి శివ్‌నగర్ అనధికార కాలనీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మేయర్‌గా వర్షాకాల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని మీనాక్షి అంటున్నారు. దక్షిణ ఢిల్లీ మేయర్ ఖుషీరామ్ కూడా తొలిసారిగా కౌన్సిలర్‌గా ఎన్నికైనవారే. తన తండ్రి ఎమ్సీడీలో పారిశుధ్య కార్మికునిగా పనిచేసేవారని ఆయన చెబుతున్నారు. మదన్‌గీర్‌లోని జె.జె.కాలనీలోగల మూడంతస్తుల భవనంలోని  పైఅంతస్తులో ఆయన ఉంటున్నారు. మేయర్ అయినందువల్ల భారీ అధికారిక  నివాసం కేటాయించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్  కార్పొరేషన్ కోరింది. ఇల్లు చిన్నదిగా ఉండడంతో తనను కలవడానికి వచ్చేవారు ఇబ్బందిపడుతున్నారని ఖుషీరామ్ అంటున్నారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తాను పార్కింగ్ సమస్యపై దృష్టి సారిస్తానని ఆయన చెబుతున్నారు. ఉత్తర ఢిల్లీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజే పీ సీనియర్ నేత యోగేంద్ర చందోలియా పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తానంటున్నారు. ఏకీకృత ఎమ్సీడీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేసిన ఆయన మూడు మున్సిపల్ కార్పొరేషన్లను  ఏకం  చేయాలని డిమాండ్  చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement