చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : రైల్వే శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన పథకాలను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే చెప్పారు. జిల్లాలోని హొసదుర్గ రోడ్డు - చిక్కజాజూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండవ లైన్ నిర్మాణ పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ... 29 కిలోమీటర్ల పొడవున రెండవ రైల్వే లైన్ నిర్మాణాలకు రూ. 203 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు లైన్లు ఉండడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైల్వే నూతన మార్గాలకు రూ. 900 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో రైల్వే మార్గాన్ని ఉపయోగించుకోవడంలో చాలా మంది వెనుకబడి ఉన్నారన్నారు. అతి తక్కువ వ్యయంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు రైల్వే మార్గం చాలా అనువైనదని తెలిపారు. రైల్వే మార్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని 50 శాతం నిధులను కేటాయించాల్సిన అవరసం ఎంతైనా ఉందన్నారు. భూస్వాధీన ప్రక్రియలో రూ. 612 కోట్లను విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 50 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అన్నారు.
రాష్ట్రంలోని చిక్‌జాజూర్- కడూరు, బెంగళూరు- మైసూరు, మద్దూరు- శ్రీరంగపట్నం, హరిహర- కొట్టూరు రైల్వే లైన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య,మంత్రి ఆంజనేయ, చిత్రదుర్గం ఎంపీ జనార్థన స్వామి, ఎమ్మెల్యేలు గోవిందప్ప, రఘుమూర్తి, తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు బోరమ్మ పాల్గొన్నారు.
త్వరలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లు పూర్తి
Published Mon, Sep 9 2013 2:48 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement