దుర్భిక్షం
- కనిపించని నైరుతి జాడ
- జలశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
- మలెనాడులోనూ ఇదే పరిస్థితి
- ‘తుంగభద్ర’కు నీటి విడుదల బంద్
సాక్షి ప్రతినిధి/బెంగళూరు/ శివమొగ్గ : నైరుతి రుతు పవనాల జాడ లేకపోవడంతో రాష్ట్రంలో క్రమంగా కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు శర వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ నెల తొలి వారంలోనే రాష్ర్టంలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతు పవనాలు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయాయి. గత వుూడు వారాల్లో సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈసారి కూడా కరువు తప్పదేమోననే ఆందోళన నెలకొంటోంది.
గత ఏడాది కరువు నెలకొన్నా తొలకరి వర్షాలు బ్రహ్మాండంగా ప్రారంభమయ్యాయి. కుంటలు, చెరువులకు పెద్దగా నీరు రానప్పటికీ, జలాశయాలు నిండాయి. ఎప్పుడూ మంచి వర్షాలు పడే మలెనాడులో కూడా ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో బలహీనంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువే. కొన్ని చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తక పోగా, మరి కొన్ని భూమిలో తగినంత తేమ శాతం లేకపోవ డంతో విత్తనాలే వేయలేదు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొంటున్నాయి.
జులై తొలి వారంలో వర్షాలు పడే అవకాశాలున్నప్పటికీ, ఉత్తర కర్ణాటకలో వర్షాభావం నెలకొనవచ్చని వాతావ రణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద జులైలో కూడా సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆగస్టులో మాత్రం ఆశాజనకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈలోగా ఖరీఫ్ పంటలకు బాలారిష్టాలు తప్పవని, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గవ చ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా రైతులు జూన్‌లో భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటారు. జులైలో విత్తన కార్యక్రమం ఉంటుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 145 మి.మీ. సగటు వర్షపాతం కాగా కేవలం 109 మి.మీ. మాత్రమే నమోదైంది.
తుంగభద్రకు నీటి నిలిపివేత
మలెనాడులో మొన్నటి వరకు బాగా పడిన వర్షాలు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయాయి. వేసవిలో లాగా ఎండలు మండిపోతున్నాయి. దరిమిలా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శివమొగ్గ తాలూకాలోని తుంగా జలాశయం నుంచి హొస్పేటలోని తుంగభద్ర డ్యాంకు నీటి విడుదలను ఆపి వేశారు. జలాశయానికి ఉన్న అన్ని క్రస్ట్ గేట్లను బుధవారం మూసివేశారు. కరువు ఛాయలు అలుముకుంటాయనే ఆందోళనతో జిల్లాలో వర్షాల కోసం రుద్రాభిషేకాలు, గణపతి హోమాలను నిర్వహిస్తున్నారు.