తండ్రి కోసం తనయుడి యాగం
ఆయన బలి అవుతున్నారా..?
రామకృష్ణన్ అనుమానం
వివరణకు కరుణ డిమాండ్
చెన్నై : ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలి అవుతున్న చందంగా మంత్రి ఓ పన్నీరు సెల్వం పరిస్థితి మారుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు బయలు దేరాయి. ఇక, తండ్రి కోసం అన్నట్టు శతృవినాస యాగాన్ని ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ నిర్వహించడం గమనార్హం. ఇక, తన నిజాయితీని నిరూపించుకునేందుకు జయలలిత కొత్త నాటకాన్ని రచించి ఉన్నారని సీపీఎం నేత రామకృష్ణన్ విమర్శించారు.
మంత్రులపై బయలు దేరిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అన్నాడిఎంకేలో జయలలిత తదుపరి స్థానంలో ఉన్న మంత్రి, పార్టీ కోశాధికారి ఓ పన్నీరు సెల్వం ప్రస్తుతం సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇందుకు ఎన్నికల్లో వంద సీట్ల వరకు తన మద్దతు దారులకు ఇప్పించుకుని, తదుపరి తన బలాన్ని చాటుకునే వ్యూహంతో ఉన్నట్టు ఆయనపై బయలు దేరిన ఆరోపణలు కారణంగా పరిగణించ వచ్చు.
అదే సమయంలో రోజుకో రూపంలో పన్నీరుకు వ్యతిరేకంగా, నత్తం విశ్వనాథన్ తదితర మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలతో అన్నాడీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. తిరునల్వేలిలో అజ్ఞాతంలో ఉన్న పన్నీరు మద్దతు దారుడు ఓఎస్ మురుగన్ బండారాలు సైతం వెలుగులోకి రావడంతో ఓ పీఎస్‌కు కష్టాలు చుట్టుముట్టినట్టే. వంద కోట్ల మేరకు పూడిక తీత పనుల్లో అవినీతి జరిగినట్టు, ఇందుకు ఓఎస్ మురుగన్‌సూత్రదారుడిగా ఆరోపణలు వస్తున్నా, మంత్రులపై రోజుకో కథనం వెలువడుతున్నా, అన్నాడీఎంకేలో ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు.
ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత , తాజాగా మంత్రుల భరతం పట్టే విధంగా వ్యవహరిస్తుండటం చర్చకు తెర లేపి ఉన్నది. అలాగే, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంను నిర్బంధంలో ఉంచినట్టుగా ప్రచారం , పుకార్లు బయలు దేరి ఉండటం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకేను చీల్చి ఎంజీయార్ అన్నాడీఎంకే ఏర్పాటు కసరత్తుల్లో ఉండబట్టే ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ పుకార్ల నేపథ్యంలో పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కనున్నట్టుగా ప్రచారం కూడా సాగినా, ఎంతకూ ఆయన రాలేదు. రెండు రోజుల క్రితం మాత్రం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పళనియమ్మాల్‌ను పరామర్శించి ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు వచ్చినట్టు తదుపరి ఆయన ఇంటి కి లేదా, నగరంలోని ఓ హోటల్‌కు పరిమితమైనట్టుగా మద్దతు దారులు వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే.
తాజాగా, మంత్రులకు వ్యతిరేకంగా వెలువడుతున్న కథనాలను సైతం తమకు అనుకూల అస్త్రంగా మలచుకునేందుకు ప్రతి పక్షాలు సిద్ధమైనట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా సీఎం జయలలిత కొత్త నాటకాన్ని రచించినట్టుందని సీపీఎం నేత రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఓపీఎస్‌ను బలి చేయడానికి సిద్ధమైనట్టుందని ఆరోపించారు. ఇక, డిఎంకే అధినేత ఎం కరునానిధి పేర్కొంటూ, మంత్రులపై ఇస్తున్న కథనాలు, ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, శతృవినాసం కాంక్షిస్తూ ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ శ్రీవిల్లి పుత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో యాగం చేయడం కొసమెరుపు.