జ్యోతిక స్థానాన్ని అందుకోవాలి
సమంత, హన్సిక, శ్రుతిహాసన్ లాంటి వాళ్లు భారీ చిత్రాల అవకాశాలను కైవశం చేసుకు కోవడానికి పోటీ పడుతుంటే చిన్న చిత్రాలను దక్కించుకుంటూ కోలీవుడ్‌లో కథానాయికగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది నటి సృష్టి డాంగే. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అయితే ఈమెకు ఆశలు మాత్రం చాలానే ఉన్నాయి. సృష్టితో చిట్‌చాట్.
ప్రశ్న: చిన్న చిత్రాల లక్కీ నాయికగా మారినట్లున్నారే?
జవాబు: ఉన్నైప్పోల్ ఒరువన్, డార్లింగ్ చిత్రాల్లో నటించాను. అవి పెద్ద బడ్జెట్ చిత్రాలే. ప్రస్తుతం విల్‌అంబు, నవరస తిలగన్, అచ్చమిండ్రి చిత్రాలు చేతిలో ఉన్నాయి. కత్తుకుట్టి చిత్రం గురువారం తెరపైకొచ్చింది. అయితే నా వరకూ చిన్న చిత్రాలు, పెద్ద చిత్రాలు అన్న తారతమ్యాలు చూపించడం లేదు. కథా పాత్ర బాగుంటే నటించడానికి అంగీకరిస్తున్నారు.
ప్రశ్న: పారితోషికం విషయంలో పెద్దగా డిమాండ్ చేయడం లేదట?
జ: అవునా? అయితే అది మంచి విషయమేగా. ఆ విధంగా మంచి పేరే తెచ్చుకుంటున్నానుగా. ఇంకో విషయం ఏమిటంటే నాకు ఇంత పారితోషికం కావాలని ఇప్పటివరకూ ఏ నిర్మాతనూ అడగలేదు. నేను ఆశించని విధంగా నిర్మాతలు పారితోషికం చాలానే ఇస్తున్నారు. ఇక ఒక కథానాయికకు ఏమేమి కావాలో అవి మాత్రం అడిగి పొందుతున్నాను.
ప్రశ్న: కొత్త హీరోయిన్ల రాక అధికంగా ఉంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయం?
జ: ఇప్పుడు చిత్రాలు అధికంగానే తయారవుతున్నాయి. దీంతో కొత్త హీరోయిన్లు ఎక్కువగానే పరిచయం అవుతున్నారు. అయితే ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకోవడం కష్టమైన విషయమే.అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. మంచి గుర్తింపు పొందే ఒక్క చిత్రం అందరు నూతన హీరోయిన్లకు అమరాలి. అప్పుడే తమకంటూ ఒక స్థాయిని అందుకోగలరు.
ప్రశ్న: మీరు గ్లామర్ విషయంలో హద్దుల్లాంటివి పెట్టుకున్నట్లు లేదే?
జ: బికినీ దుస్తుల్లో నా స్టిల్ చూసి మీరు ఇలాంటి అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. ఒక చిత్రానికి సంబంధించిన స్టిల్ అది. నిజానికి ఆ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేవు. చిత్ర ప్రచారం కోసం ఆ స్టిల్స్ వాడుకుంటున్నారు. అది బాధాకరమైన విషయమే.ఆ చిత్రం గురించి మాట్లాడడమే ఇష్టం లేదు. ఇక గ్లామర్ విషయం అంటారా అందుకు నా హద్దులు నాకున్నాయి.
ప్రశ్న: మీరు ఏ హీరోయిన్ స్థానాన్ని పొందాలనుకుంటున్నారు?
జ: ఈ అమ్మాయి ఇండ స్ట్రీలో ఒక రౌండ్ చుట్టేస్తుంది అని నన్ను చూసి చాలా మంది అన్నారు.అలాంటి మాటల్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. నా రోల్ మోడల్ జ్యోతిక మేడమ్.ఆమె స్థానాన్ని అందుకోవాలన్నది నా ఆశ.