స్టాలిన్ ఎట్రాక్షన్
డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ గురువారం చెన్నైలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఓట్ల వేటకు నడక పయనం సాగిస్తూ రోడ్ల వెంబడి ఉన్న వాళ్లను పలకరిస్తూ ముందుకు సాగారు.
సాక్షి, చెన్నై : డీఎంకే దళపతి ఎంకే.స్టాలిన్ ఈ సారి స్టైలిష్ అవతారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచార పర్యటన సాగి ఉన్నది. ఇక, చెన్నైలో సమయం దొరికినప్పుడల్లా ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఆయన చెన్నైలో మరింత ఆకర్షణగా మారారు. బుధవారం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రచార వాహనంలో చెన్నైను చుట్టి వస్తే, తన రూటే సెపరేట్ అన్నట్టుగా స్టాలిన్ ఎట్రాక్షన్ ప్రచారం సాగింది. ఉదయాన్నే ఎగ్మూర్ నియోజకవర్గం పరిధిలోకి స్టాలిన్ వాహనం దూసుకెళ్లింది.
వాహనం ఓ చోట పార్కింగ్ చేసి, తదుపరి నడకతో ఓట్ల వేటలో పడ్డారు. స్టాలిన్ హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో జనం పరుగులు తీశారు. యువత కరచాలనానికి ఎగబడ్డారు. కొందరు అయితే, సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్న చిన్న వీధుల్లో నడుచుకుంటూ అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు. మహిళలు అత్యధికంగా ఉన్న చోట మాత్రం ఆగి మరీ వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, ఎగ్మూర్ అభ్యర్థి రవి చంద్రన్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఎగ్మూర్‌లోని పలు ప్రాంతాల్లో నడకతో అందర్నీ పలకరించిన స్టాలిన్ తదుపరి, టీనగర్ నియోజకవర్గం అభ్యర్థి కనిమొళికి మద్దతుగా వడపళని నుంచి నడక ప్రచారం మొదలెట్టారు. మండుటెండలో స్టాలిన్ నడిచి వస్తుండడంతో అక్కడున్న ఓ కొబ్బరి బొండాం వ్యాపారి పరుగున ఓ బొండం అందించారు. దానిని స్వీకరిస్తున్న స్టాలిన్‌ను చూడగానే, అటు వైపుగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంలోని వరుడు పరుగులు తీశారు. స్టాలిన్‌తో ఫొటో దిగి ఆనందాన్ని పంచుకున్నాడు.
అక్కడి పూల వ్యాపారులు స్టాలిన్‌కు రోజా పువ్వులు ఇచ్చి ఆహ్వానించారు. మార్కెట్ పరిసరాల గుండా కోడంబాక్కం వైపుగా స్టాలిన్ నడకతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. తదుపరి సైదాపేటకు చేరుకుని అక్కడి అభ్యర్థి ఎం సుబ్రమణియన్‌తో కలసి పరుగులు తీశారు. తదుపరి హార్బర్‌లో శేఖర్‌బాబుకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. తన పర్యటనలో ఓ చిన్నారికి అరవింద్ అన్న నామకరణం కూడా చేశారు.
చిన్న పిల్లలు పలువురు స్టాలిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడగా, యువతీ, యువకులు కరచాలనం, సెల్ఫీల కోసం పరుగులు తీశారు. వాహనంలో కూర్చుని రోడ్డు మీద రయ్యూమంటూ దూసుకెళ్లే ప్రచారం తనది కాదని, ప్రజల్లో ఒక్కడికి కలిసి మెలిసి తిరుగుతూ ఆకర్షించేడమే తన పయనం అన్నట్టుగా స్టైలిష్ స్టాలిన్ ప్రచారం సాగడం విశేషం.