న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు నలుగురిపై అత్యాచారం జరుగుతోంది. దేశంలోని మరే నగరంలోనూ అత్యాచారాల సంఖ్య ఇంతగా లేదు. 2013లో 1,636 అత్యాచారం కేసులు నమోదైనట్లు జాతీయ నేరగణాంకాల విభాగం(ఎన్‌సీఆర్‌బీ) పేర్కొంది. దేశంలోనే ఇది అత్యధికమని వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2012లో దేశవ్యాప్తంగా 24,923 అత్యాచార కేసులు నమోదు కాగా 2013 నాటికి వాటి సంఖ్య 33,707కు పెరిగింది. అత్యాచార బాధితుల్లో 15,,556 మంది 18-30 సంవత్సరాల వయసువారే.
ఇక ఢిల్లీలో 2012తో పోలిస్తే 2013లో అత్యాచార కేసుల సంఖ్య ఏకంగా రెట్టింపయింది. 2012లో 706 కేసులు నమోదు కాగా 2013లో 1,636 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 391, జైపూర్‌లో 192, పుణేలో 171 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్‌లో రోజుకు 11 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ 4,335 కేసులు నమోదు కాగా రాజస్థాన్‌లో 3,285, మహారాష్ట్రలో 3,063, ఉత్తరప్రదేశ్‌లో 3,050 కేసులు నమోదయ్యాయి. 94 శాతం కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బాధితులకు పరిచయం ఉన్నవారే కావడం గమనార్హం. కాగా అత్యాచార కేసులు పెరగడంపై పోలీసులు స్పందించారు. తాము తీసుకున్న చర్యల ఫలితంగానే ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని, ఫలితంగానే కేసుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు.
రోజుకు నలుగురిపై అత్యాచారం
Published Thu, Sep 4 2014 10:55 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement