అత్యాచార బాధితులకు వన్‌స్టాప్ సెంటర్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారాల బాధితుల కోసం వన్‌స్టాప్ సెంటర్ సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ప్రారంభమైంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దీనిని గురువారం ప్రారంభించారు. వారం రోజుల తరువాత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో మరో వన్‌స్టాప్ సెంటర్ ప్రారంభమవుతుంది. ఆరు నెలల్లో నగరంలోని ఆరు ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటుచేస్తారు, ఢిల్లీలోని 11 జిల్లాల్లో వన్‌స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోనే రెండు సెంటర్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
నిర్భయ ఘటన తరువాత ఉషా మెహ్రా కమిటీ నివేదిక మేరకు ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి వన్‌స్టాప్ సెంటర్‌ను భోపాల్‌లో ఏర్పాటుచేశారు. అత్యాచార బాధితురాళ్లు ఇక నుంచి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేయాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వన్‌స్టాప్ సెంటర్లోనే పోలీసులు బాధితురాలి వాంగ్మూలం తీసకోవడంతో పాటు కేసు నమోదుచేస్తారు. వన్‌స్టాప్ సెంటర్‌లో గైనిక్, ఫోరెన్సిక్, సర్జరీ నిపుణులతోపాటు సోషల్ వర్కర్లు, పోలీసు, ఢిల్లీ మహిళా కమిషన్, ఎన్జీఓ ప్రతినిధులు ఉంటారు. బాధితురాలికి అవసరమైన న్యాయసహాయం, కౌన్సెలింగ్ కూడా ఇక్కడే లభిస్తుంది.