
ఆందోళనలతో అట్టుడికిన చెన్నై
రిప్పన్ బిల్డింగ్‌ను కార్పొరేషన్ సిబ్బంది, దివ్యాంగుల కమిషన్‌రేట్‌లో అంధులు, విద్యా శాఖ కమిషనరేట్‌ను విద్యార్థులు ముట్టడించి ఆందోళనలు జరిపిన సంఘటన సంచలనం కలిగించింది.
► రిప్పన్ బిల్డింగ్‌ను ముట్టడించిన కార్పొరేషన్ సిబ్బంది
► స్థానాలు భర్తీ చేయాలని దివ్యాంగుల డిమాండ్
కేకేనగర్: చెన్నై, రిప్పన్ బిల్డింగ్‌ను కార్పొరేషన్ సిబ్బంది, దివ్యాంగుల కమిషన్‌రేట్‌లో అంధులు, విద్యా శాఖ కమిషనరేట్‌ను విద్యార్థులు ముట్టడించి ఆందోళనలు జరిపిన సంఘటన సంచలనం కలిగించింది.
కార్పొరేషన్ సిబ్బంది ఆందోళన
ఎన్‌ఎంఎల్‌ఎం స్వర్ణజయంతి ఒప్పంద కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు అందజేయాలి, ఎన్‌ఎంఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 7వ వేతన కమిటీ సిఫారసులను అమలు చేయాలని, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ సిబ్బంది రిప్పన్ బిల్డింగ్ ముందు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఎర్ర జెండాల సంఘం తరఫున వెయ్యికి పైగా కార్పొరేషన్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. గురువారం వారందరూ రిప్పన్ బిల్డింగ్‌ను ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని సంఘ ఉప కార్యదర్శి దేవరాజ్ తెలిపారు.
దివ్యాంగులు ఆందోళన :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్న దివ్యాంగులకు వెంటనే ఉద్యోగాలు ఇప్పించాలి, దివ్యాంగుల కోటాలో ఖాళీగా ఉన్న ఉద్యోగ స్థానాలను అర్హులైన అంధులకు కేటాయించాలి, నిరుద్యోగులైన అంధులకు అందజేసే సహాయ నిధిని రెండు వేల రూపాయలకు పెంచాలి తదితర 22 డిమాండ్లను ముందుంచుతూ చెన్నై కామరాజర్ సాలైలో గల దివ్యాంగుల కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించి అంధులు గురువారం ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి తమను కలిసే వరకు తాము ఆందోళన విరమించ బోమని తెలిపారు.
పాఠశాల విద్యా కమిషనరేట్ ముట్టడి :
ప్రైవేటు పాఠశాలల్లో అదనపు ఫీజు వసూలును ఖండిస్తూ భారత విద్యార్థుల సంఘం తరఫున పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.