చాక్లెట్ తిన్న విద్యార్థులకు అస్వస్థత | Students ill after eating chocolate | Sakshi
Sakshi News home page

చాక్లెట్ తిన్న విద్యార్థులకు అస్వస్థత

Published Thu, Aug 15 2013 6:36 AM | Last Updated on Sat, Aug 11 2018 6:59 PM

Students ill after eating chocolate

తమ తోటి విద్యార్థిని జన్మదినం సందర్భంగా పాఠశాలలో పంపిణీ చేసిన చాక్లెట్లు తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది బాలికలు, ఎనిమిది మంది బాలురున్నారు. ఠాణే మాజీవాడాలోని సంకేత్ పాఠశాలలో  బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అందిన వివరాల మేరకు...స్థానిక మనపాడా ప్రాంతంలోని సంకేత్ విద్యాలయలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సహచర విద్యార్థిని పుట్టినరోజు కావడంతో తీసుకొని వచ్చిన చాక్లెట్లను తీసుకొని తిన్నారు. అనంతరం అనేక మంది విద్యార్థులకు కడుపులో మంట, నొప్పి ప్రారంభమైంది. ఆ వెంటనే వీరిని పాఠశాల యజమాన్యం సమీపంలోని  టైటన్ ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం అనేక మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు ఐదుగురు విద్యార్థులకు ఇంకా అబ్జర్వేషన్‌లోనే ఉంచారు. 
 
ఈ సంఘటన అనంతరం ఒక్కసారిగా పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో పాఠశాలతో పాటు టైటాన్ ఆసుపత్రి పరిసరాల్లో రద్దీ కన్పించింది. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపించగా, తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని  తెలుసుకున్న తల్లిదండ్రుల్లో విషాదం నెలకొంది. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసిన కాపూరిబావుడి పోలీసులు చాక్లెట్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని ఆరా తీసి బానుశాలి అనే దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలకు చాక్లెట్‌లు, తినుబండారాలు పంపిణీ చేయడాన్ని నిషేధించామని పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. దీనికి బదులు పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని సూచించామని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement