అమీర్ పేట భూములపై సుప్రీంలో వ్యాజ్యం
భూములు పొందిన వారికి నోటీసులు జారీ
తమిళనాడు గవర్నర్‌కు నోటీసులు అవసరం లేదని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: అమీర్‌పేట భూముల కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కె.మోహన్‌లాల్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌తో కూడిన ధర్మాసనం దీన్ని మంగళవారం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడం సరికాదని, దానిపై స్టే ఇవ్వాలని కోరారు.
ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు సమన్లు జారీచేయడం సాధ్యం కాదన్న హైకోర్టు తీర్పు సబబేనని రోశయ్య తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు కోర్టుకు విన్నవించారు. కాగా, హైకోర్టు తీర్పులో ఎక్కడా ఆర్టికల్ 361 ప్రస్తావన లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రోశయ్య తరపున న్యాయవాది కేవియట్ పిటిషన్ వేసి హాజరైనందున రోశయ్యకు నోటీసులు అవసరం లేదని పేర్కొంటూ, భూములు పొందిన వారికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ధర్మాసనం ఆరు వారాల పాటు వాయిదా వేసింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా అమీర్‌పేట్‌లోని 9.14 ఎకరాల ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.