ఆటోచార్జీలపై నిఘా
Published Mon, Sep 30 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
ఆటోచార్జీలను పటిష్టంగా అమలుపరిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆటోవాలాల ఆగడాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించనుంది. ఇక రాత్రుల్లోనూ తనిఖీలు జరపనుంది.
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆటోచార్జీల దోపిడీకి కళ్లెం వేస్తూ ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. ఆటోలకు మీటర్లను తప్పనిసరి చేసింది. కనీసచార్జీగా రూ.25 నిర్ణయించింది. 1.8 కిలోమీటర్ల అనంతరం ప్రతి కిలోమీటర్‌కు రూ.12 వసూలు చేయూలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఆటో సంఘాలు ఆహ్వానించాయి. అయితే మీటర్లు బిగించేందుకు, చార్జీల అమలుకు ఆటోడ్రైవర్లు తొలుత ముందుకు రాలేదు. దీంతో పోలీసు యంత్రాంగం కొరడా ఝుళిపించింది. ఆటోచార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రచారాన్ని వేగవంతం చేసింది. మీటర్లు లేని ఆటోలకు జరిమానా మోత మోగించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆటోచార్జీల్ని తప్పక అమలు చేయూలని ఆదేశించింది. దీంతో ఆటోడ్రైవర్లు కొత్త మీటర్ల కొనుగోలు లేదా పాత మీటర్లకు మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫిర్యాదులు
కొత్త చార్జీలను పట్టించుకోకుండా కొంతమంది ఆటో డ్రైవర్లు తమ పనితనం చూపడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో చార్జీల అమలు పరిశీలన, తనిఖీలను పోలీసు యంత్రాంగం వేగవంతం చేసింది. వెయ్యి ఆటోల్ని సీజ్ చేసింది. ఈ క్రమంలో మిగిలిన డ్రైవర్లు బెంబేలెత్తారు. పోలీసుల భయంతో పగలు వరకు చార్జీలను అమలు చేస్తున్నారు. రాత్రి ఏడు తర్వాత తమ ఇష్టానుసారం చార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపైనా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
చార్జీలను పూర్తిస్థాయిలో అమలుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపేందుకు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయించారు. ఒక్కో బృందంలో ఎనిమిది మంది చొప్పున సభ్యులు ఉంటారు. వీరు రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో మాటు వేస్తారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆటోడ్రైవర్ల భరతం పట్టనున్నారు.
బుక్‌లెట్‌ల పంపిణీ
ఆటోచార్జీలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా రెండు లక్షల ప్యాకెట్ బుక్‌లెట్‌లను చెన్నై ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం సిద్ధం చేసింది. చెన్నైలోని వివిధ ప్రాంతాలు, సందర్శనీయ ప్రదేశాలు, ఆటోచార్జీలు తదితర వివరాలను ఇందులో పొందుపరిచింది. వీటిని శనివారం నుంచి పంపిణీ చేస్తోంది.
Advertisement
Advertisement