కోర్టుకెక్కిన ఆటోవాలా
Published Wed, Oct 2 2013 12:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
మీటర్లు లే ని ఆటోలను సీజ్ చేస్తుండడం ఆటోవాలాలను బెంబేలెత్తిస్తోంది. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల రద్దు హెచ్చరికల నేపథ్యంలో వారు కోర్టుకెక్కారు. అధికారుల చర్యల నుంచి రక్షించాలని విన్నవించారు. మీటర్లు అమర్చుకునేందుకు గడువు ఇవ్వాలని వేడుకున్నారు.
సాక్షి, చెన్నై: ఆటోవాలాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటోచార్జీల్ని నిర్ణయించింది. వీటిని అమలు చేయించేందుకు నెల రోజులుగా కుస్తీలు పడుతోంది. ప్రభుత్వమే ఆటోడ్రైవర్లకు ఉచితంగా ప్రింటింగ్, జీపీఎస్‌తో కూడిన మీటర్లు ఇచ్చేందుకు నిర్ణయించినా పంపిణీలో జాప్యం నెలకొంది.దీంతో పాత మీటర్లకు మరమ్మతులు చేయించుకుని, కొత్తరేట్లను పొందుపరుచుకునే పనిలో డ్రైవర్లు ఉన్నారు. అయితే మీటర్లను మరమ్మతు చేసే మెకానిక్‌లు నగరంలో సరిపడా లేకపోవడం ఆటోడ్రైవర్లకు శాపంగా మారింది. చార్జీల అమలు తీవ్రతరం అయినా మీటర్లు లేని ఆటోలు నగరంలో కోకొల్లలుగా తిరుగుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు రంగంలోకి దిగారు. మీటర్లు లేని, చార్జీల్ని అమలు చేయని ఆటోల్ని అధికారులు సీజ్ చేయడం, జరిమాన మోత మోగించడం ప్రారంభించారు. మీటర్ల ఏర్పాటుకు మరింత గడవు ఇవ్వాలంటూ డ్రైవర్లు ఆందోళనబాట పట్టినా ప్రభుత్వం స్పందించ లేదు.
రక్షించండి
మీటర్లు లేని ఆటోల్ని సీజ్ చేస్తామని, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్‌లు రద్దు పరుస్తామని రాష్ట్ర రవాణాశాఖ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆటోడ్రైవర్లు మరింత ఆందోళన చెందారు. మంగళవారం మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కారు. చెన్నై ఆటో కార్మిక సంఘం కార్యదర్శి మనోహరన్, ఉత్తర చెన్నై ఆటోడ్రైవర్ల భద్రతా సంఘం కార్యదర్శి ఆనందన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆటోచార్జీల్ని గుర్తు చేశారు. వీటిని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అసలు చిక్కంతా మీటర్ల రూపంలో ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో 72 వేల ఆటోలు ఉన్నాయని వివరించారు. అన్నీ పాతమీటర్లని, వాటిని మరమ్మతు చేసే మెకానిక్‌లు సరిపడా లేరని పేర్కొన్నారు. మీటర్లలో కొత్తచార్జీల పొందుపరచడం కోసం నగరంలో 39 కేంద్రాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు.
వీటి ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది వేల ఆటోలకు మాత్రమే కొత్త చార్జీల్ని పొందుపరిచారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇంకా 64 వేల ఆటోల్లో చార్జీల వివరాలను పొందుపరచాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ కేంద్రాల్లోనే జాప్యం జరుగుతుంటే తామెలా మీటర్లను త్వరితగతిన ఏర్పాటు చేసుకోగలమని ప్రశ్నించారు. లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరికలు వెలువడ్డాయని, ఈ దృష్ట్యా తమకు మరింత గడువు ఇస్తే ఆటోలకు మీటర్లు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. గడువు కేటాయించకుండానే తమ మీద చర్యలు తీసుకోవడం భావ్యమా అని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కేకే శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈ నెల 7వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Advertisement