ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఇకపై దుకాణాలు, వాణిజ్య సముదాయాలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. వాణిజ్య, వ్యాపార అభివృద్ధితో పాటు, మహిళా ఉద్యోగులు భద్రతపై తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. మూడు ఏళ్ల పాటు ఈ విధానం కొనసాగించనున్నట్టు తెలిపింది.
2016లో కేంద్రప్రభుత్వం దుకాణాలు మరియు విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబందించిన నిబంధనల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా పలు పరిశ్రమలు వారం లో 7 రోజుల పాటు 24 గంటలు పనిచేయవచ్చు. ఈ చట్టాన్ని అలాగే అమలు చేసుకోవచ్చు లేకపోతే.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని కూడా అందులో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను నిర్దేశించుకోవచ్చు.
ఇప్పటికే మహారాష్ట్ర 24 గంటలు పని చేసేలా నిబంధనలను మార్చుకుంది. ఇప్పుడు తమిళనాడు కూడా ఆ జాబితాలో చేరింది. తమిళనాడులోని సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా అన్ని రకాల పరిశ్రమలు నిరంతరాయంగా 24 గంటలు పని చేయవచ్చు. ఇక రాత్రిపూట పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి సంస్థల నుంచి లిఖిత పూర్వక హామీని తీసుకోనున్నారు. వారం రోజులూ పని చేసే సంస్థలో ఎవరికి ఏ రోజు సెలవు అన్న వివరాలకు సంబంధించి తప్పనిసరిగా బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ టైమ్ 10.30 గంటలకు మించరాదు.
Comments
Please login to add a commentAdd a comment