‘కర్ణాటక’కు అనుమతి లేదు
సాక్షి, చెన్నై:కావేరి తీరంలో కొత్త డ్యాముల నిర్మాణానికి కర్ణాటకకు అనుమతులు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమిళనాడుకు ఆటంకాలు కలిగించే నిర్ణయాలు తీసుకోబోమని అన్నదాతలకు హామీ ఇచ్చారు. కావేరి నదీ జలాలే రాష్ట్రంలోని డెల్టా జిల్లాల అన్నదాతలకు ప్రధాన వరం. తాగు, సాగుబడికి ఆ నీళ్లు అందాల్సిందే. అయితే, ఆ నీటిని అడ్డుకునే రీతిలో కర్ణాటక పాలకులు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. తమిళనాడుకు వాటాగా ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వడంలో ఆడ్డంకులు సృష్టిస్తూ వచ్చిన కర్ణాటక కొత్త కుట్రకు ఒడిగట్టే పనిలో పడింది. తమిళనాడు - కర్ణాటక సరిహద్దులోని మేఘ దాతు వద్ద రెండు జలాశయాల్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. తమ రాష్ట్రంలోని కృష్ణరాజ సాగర్, కబని డ్యాంలు నిండిన పక్షంలో ఉబరి నీళ్లు తమిళనాడులోకి పెద్ద ఎత్తున వచ్చి చేరుతుండడాన్ని కర్ణాటక సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ఉబరి నీళ్లు తమిళనాడులోకి ప్రవేశించకుండా నాలుగేసి చొప్పున టీఎంసీల నీళ్లు నిల్వ ఉండే విధంగా రెండు డ్యాంల నిర్మాణాలకు కసరత్తుల్ని వేగవంతం చేసింది.
ఈ సమాచారం డెల్టా జిల్లా అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. కర్ణాటక చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియజేశారు. అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నా, అఖిల పక్షానికి ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నా, రాష్ట్రంలోని సీఎం పన్నీరు సెల్వం సర్కారు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలతో కాలయాపన చేసే పనిలో పడింది. అనుమతి లేదు : కర్ణాటక చర్యలను అడ్డుకోవాలని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు పట్టుబడుతూ రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ ఏకమయ్యాయి. అన్ని సంఘాలు కలసి కట్టుగా ఢిల్లీకి వెళ్లాయి. ప్రధాని నరేంద్ర మోదీ అనుమతిని కోరాయి. ఇందుకు మోదీ అంగీకరించారు. దీంతో మంగళవారం రైతు సంఘాల నాయకులు మాసిలా మణి, తంబు స్వామి, మోహన్, సేతురామన్, కుమరేషన్‌లతో పాటుగా సీపీఐ ఎంపీ డి రాజా, సీపీఎం ఎంపీ రంగరాజన్‌లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
కర్ణాటక కుట్రల్ని వివరిస్తూ, వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌చేస్తూ ఓ వినతి పత్రాన్ని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మరో వినతి పత్రాన్ని అందజేశారు. డెల్టా జిల్లాలోని కావేరి నదీ తీరంలో మీథైన్ తవ్వకాలను నిలుపుదల చేయాలని మరో వినతి పత్రం అందజేశారు. వీటిని పరిశీలించినానంతరం తమిళ అన్నదాతలకు భరోసా ఇచ్చే రీతిలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ విషయమై అన్నదాతలు మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో డ్యాంల నిర్మాణానికి కేంద్రం ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని, ఇవ్వబోదని మోదీ తమకు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తమిళనాడుకు ఇబ్బందులు, ఆటంకాలు కలగని రీతిలో కావేరి జలాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటామని మోదీ భరోసా ఇచ్చారని వివరించారు. మీథైన్ తవ్వకాల వ్యవహారాన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తమకు హామీ ఇచ్చినట్టు తెలిపారు.