
ఘటనా స్థలి
ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
సాక్షి, చెన్నై: తమిళనాడులో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పుదుకోటై- తిరుచ్చి రహదారిలో నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఘటనా స్థలి మార్మోగింది. ఈ దుర్ఘటనలో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.