టార్గెట్ తమిళ రాష్ట్రాలు
దక్షిణాదిపై కన్నేసిన కమలనాథులు టార్గెట్ తమిళనాడుగా ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరోసారి ఢిల్లీ గద్దెనెక్కించాలనే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సోమవారం పుదుచ్చేరి, మంగళవారం తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
♦ పార్టీ నేతలతో అమిత్‌షా కసరత్తు
♦ రాష్ట్రపతి ఎన్నికకు ఓట్ల సేకరణ, పార్టీ సమావేశాలు
♦ నేడు తిరువణ్ణామలైకి
సాక్షి ప్రతినిధి, చెన్నై:
గత కొంతకాలంగా దేశవ్యాప్త పర్యటనల్లో ఉన్న అమిత్‌షా తన 91వ రోజు మజిలీని పుదుచ్చేరిలో పెట్టుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పుదుచ్చేరి చేరుకున్న అమిత్‌షా తమిళుల అత్యంత ప్రీతిపాత్రుడైన మహాకవి భారతియార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ నేతలు అమిత్‌షాకు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి మోటార్‌సైకిల్‌పై ర్యాలీగా నగరమంతా పర్యటించారు. ఆ తరువాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఎన్‌ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే ప్రతిపక్ష స్థానంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో వీరి ఓటు ఎవరికనే స్పష్టత రాలేదు. అమిత్‌షాకు బీజేపీ నేతలు విందు ఏర్పాటుచేయగా పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్‌ఆర్ రంగస్వామి, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం పాల్గొని రాష్ట్రపతి ఎన్నికలపై మద్దతు తెలిపారు. దీంతో అమిత్‌షా వచ్చిన పని కొంతవరకు నెరవేరినట్లయింది.
ఆ తరువాత పుదుచ్చేరికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మాట్లాడారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. డీఎంకే కాంగ్రెస్ పక్షాన ఉన్న కారణంగా అన్నాడీఎంకే మద్దతు కూడగట్టాలని బీజేపీ భావిస్తోంది. అయితే అన్నాడీఎంకే మూడుముక్కలుగా చీలిపోవడం బీజేపీకి నిరాశ కలిగించే అంశం. అన్నివర్గాలను విలీనం చేసేందుకు కమలనాథులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా మూడువర్గాల మధ్య కక్షలు కార్పణ్యాలు మరింత పెరిగాయి. ఈ దశలో జయలలిత లేని లోటును అన్నాడీఎంకే తోడుగా బీజేపీ తీర్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చిన అమిత్‌షా ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతారో వేచి చూడాల్సి ఉంది.
నేడు తిరువన్నామలైకి రాక
పుదుచ్చేరి కార్యక్రమాలను పూర్తిచేసుకున్న అమిత్‌షా మంగళవారం తమిళనాడులోని తిరువన్నామలైకి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. ఆయన రాక సందర్భంగా తిరువన్నామలైలోని అన్నామలై ఆలయం, ప్రభుత్వ కళాశాల, రమణ మహర్షి ఆశ్రమంల వద్ద ఎస్పీ పొన్ని నాయకత్వంలో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.