అధ్యక్షులుగా చలామణి
అధికారిక ఇన్‌చార్‌జలు మౌనం
అటకెక్కిన సభ్యత్వ నమోదు
చెన్నై: ప్రాంతీయం నుంచి జాతీయత్వాన్ని వంట బట్టించుకునే ప్రయత్నంలో తమిళనాడులోని తెలుగుదేశం పార్టీ తప్పటడుగులు వేస్తోంది. పదవుల ముసుగు లో ప్రచారం కోసం పాకులాడే నేతలతో తప్పుటడుగులకు సైతం పాల్పడుతోంది. వెరసి తమిళ టీడీపీలో ‘ఎందరో పెద్దలు అందరికీ అధ్యక్ష పదవులే’ అన్న చందంగా మారి పోయింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తొలి ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవించిన తెలుగుదేశం తమిళనాడులోని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుతామంటూ ముందుకు వచ్చింది.
జాతీయ పార్టీ గా విస్తరించేందుకు వీలుగా పొరుగున ఉన్న తమిళనాడు ను ఎంచుకుంది. తమిళనాడులో తమిళుల తరువాత తెలుగువారి శాతం అధికం కావడంతో సులువుగా వేళ్లూనుకోవచ్చని ఆశించింది. పార్టీలో నంబర్‌టూగా చలామణి అవుతున్న చంద్రబాబు తనయుడు లోకేష్ చెన్నై పెత్తనాన్ని చేతుల్లోకి తీసుకున్నారు.
తమిళనాడు పార్టీ ఇన్‌చార్జ్‌గా బీదా మస్తాన్‌రావును నియమించారు. ఈ సమాచారం అందిందే తడవుగా చెన్నైలోని టీడీపీ అభిమానులు వెంటనే హైదరాబాద్ రెలైక్కాశారు. చినబాబు చుట్టూ చేరేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు బీదా మస్తాన్‌రావు తదితర పార్టీ పెద్దలు చెన్నైలో సమావేశం నిర్వహించారు. హాజరైన అభిమానులను ఆశీర్వదించి త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పార్టీ ఆదేశించారు.
తిరుపతి ఎన్‌కౌంటర్‌తో తిరోగమనం: పార్టీ పెద్దలు ఇచ్చిన పెత్తనాన్ని అడ్డుపెట్టుకుని సభ్యత్వ నమోదుకు కొందరు సిద్ధమయ్యారు. చెన్నై పాండీబజార్‌లోని ఒక హోటల్‌లో సభ్యత్వ నమోదు ప్రారంభమని ప్రచారం చేశారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలపై తిరుపతి కొండ ల్లో కాల్పులు జరగడం, 20 మందిని హతమార్చడంతో టీ డీపీపై ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. ఈ పరిణామంతో త మిళనాడుకు విస్తరించే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టీడీ పీ సమావేశం జరిగితే ముట్టడిస్తామనే రీతిలో కొందరు హెచ్చరించడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం అటకెక్కేసింది. అంతటితో టీడీపీ కార్యక్రమాలకు తెరపడింది.
పార్టీనే లేని చోట పెత్తందార్లు: టీడీపీ అధిష్టానమే తమిళనాడులో పార్టీ కార్యక్రమాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన పరిస్థితిలో ఇదే అదనుగా కొందరు పెత్తందార్లు పుట్టుకొచ్చారు. తమిళ టీడీపీ కార్యక్రమాలను తానే చూస్తున్నానని చెప్పుకుంటూ సుమారు ఐదు మంది చలామణిలో ఉన్నా రు. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి అందరికంటే మరో ముందడుగు వేసి తాను టీడీపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడినని తనకు తాను ప్రకటించేసుకున్నాడు.
తమిళనాడు ఎన్నికల్లో టీడీపీ ఎవరికి మద్దతు ఇవ్వాలో రెండురోజుల్లో తెలియజేస్తామని కూడా ఆయన ప్రకటించేశారు. పార్టీ అధ్యక్షుడిగా స్వేచ్చగా చలామణి అవుతుండగా ఇతర పెద్దలు ఖండించకుండా మనకెందుకు లెమ్మని మిన్నకుండిపోతున్నారు. లో కేష్ ప్రకటించిన ఇన్‌చార్జ్‌లు ముఖం చాటేయగా, ‘పిల్లి గు డ్డిదైతే ఎలుక ఏదో చేసింది’ అనే సామెతలా తమిళ టీడీపీ లో అందరూ పెద్దలుగా మారిపోయారు. తమిళనాడులో నెలకొన్న ఈ గందరగోళంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీని సాక్షి ప్రశ్నించగా, ఏపీ, తెలంగాణ మినహా ఎక్కడా రాష్ట్ర అధ్యక్షులు లేరని, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా చలామణి అవుతున్న సంగతిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు.