కలెక్టర్‌పై టీడీపీ నేతల కన్నెర్ర
- తమ సిఫారసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
- నీరు- చెట్టు అవినీతిపై విచారణకు ఆదేశించడం జీర్ణించుకోలేకపోతున్న నేతలు
- ఇలాగైతే జిల్లాలో పార్టీని నడపలేమని సీఎంకు విన్నపాలు
- సమస్య పరిష్కరించాలని మంత్రికి సీఎం ఆదేశం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుపై టీడీపీ నేతలు కన్నెర్ర చేశారు. కలెక్టర్ తమ సిఫారసులు పట్టించుకోవడం లేదనీ, నీరు-చెట్టు పనుల మీద విచారణ చేస్తున్నారని వారు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ముత్యాలరాజుకు ప్రభుత్వం జూలైలో పదోన్నతి కల్పించి కలెక్టర్‌గా నియమించింది.
జూలై 25వ తేదీ ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ శాఖాధిపతులను (హెచ్‌ఓడీ) పరుగులు తీస్తున్నారు. హెచ్‌ఓడీలు సరిగ్గా పనిచేస్తే కింది స్థాయి ఉద్యోగులు బాగా పనిచేస్తారనే సూత్రంతో ముందుకు పోతున్నారు. నెలరోజుల్లోపే జిల్లా పరిస్థితులు అవగాహన చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జిల్లాలో మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన పెండింగ్ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.
దగదర్తి విమానాశ్రయం భూసేకరణ వ్యవహారంలో కొందరు దళారులు, అధికార పార్టీ నేతలు భూ యజమానుల వివరాలు గల్లంతు చేసి తమకు కావాల్సిన వారి పేర్లు చేర్చే ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ కఠినంగా వ్యవహరించడంతో కింది స్థాయి అధికారులు కలెక్టర్ ఊరుకోరు అని చెప్పి అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోగలుతుతున్నారు.
వెబ్ ల్యాండ్ వ్యవహారంలో జిల్లాలోని విడవలూరు,కోట,ఉదయగిరి, కొడవలూరు, కోవూరు, రాపూరు మండలాల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతిపై కలెక్టర్ గట్టిగా స్పందించారు. అటవీ, ప్రభుత్వ, డీకేటీ, ప్రైవేట్ భూములను సైతం ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీద వన్‌బీలో ఎక్కించిన అవినీతి కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మండల తహశసీల్దార్ కార్యా లయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లందరినీ ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్‌కు బదిలీ చేశారు.
ఈ నిర్ణయం అమలు జరిగిన వెంటనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక నాయకుడు కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలు ఉపసంహరించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. నిర్ణయం అమలు జరిగిపోనందువల్ల దాన్ని వెనక్కు తీసుకోవడానికి కలెక్టర్ ఇష్టపడలేదు. దీంతో సదరు నాయకుడు ఆయన మీద ఆగ్రహించారని తెలిసింది. నీరు-చెట్టు అవినీతిపై విచారణ రెండున్నరేళ్లలో జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నీరు- చెట్టు పనులు జరిగాయి. ఇందులో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నిధుల కుంభకోణం జరిగింది.
కోవూరు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే, టీడీపీ నేతలు, నీటిపారుల శాఖ అధికారులు కలిసి పనులు చేయకుండానే ఎంబుక్కులు రాసి నిధులు దిగమింగారని అధికార పార్టీ నాయకులే కోర్టు కెక్కారు. ఈ కుంభకోణంలో అధికారులు 30 శాతం, అధి కార పార్టీ నాయకులు 70 శాతం తినేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఇందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీంతో పాటు సర్వేపల్లి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్,గూడూరు నియోజకవర్గాల్లో సైతం నీరు- చెట్టు పనుల్లో భారీ అవినీతి జరిగిం దని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఆయన ఈ పనులన్నింటి మీద విచారణ జరిపించడానికి అధికారులను నియ మించారు. ఇదే సందర్భంలో రూ.70 కోట్లకు సంబంధించి పంపిన కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్ తిప్పి కొట్టారు. ఈ నిర్ణయాల మీద జిల్లా టీడీపీ నేతలకు చెప్పరాని కోపం వచ్చింది.
పనులు చేసింది తమ పార్టీ వారే అయినప్పుడు వాటి మీద విచారణ ఎలా జరిపిస్తారనీ, కొత్త పనులకు ఆమోదం ఇవ్వకుండా వెనక్కు ఎలా పంపుతారని ఆ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ విషయం నేరుగా కలెక్టర్‌తో మాట్లాడకుండా మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
కలెక్టర్ ఇలాగే ఉంటే జిల్లాలో తాము పనిచేయలేమనీ,పార్టీని కూడా నడపలేమని కొందరు నాయకులు ఇటీవల సీఎంకు గట్టిగా చెప్పారని సమాచారం.అరుుతే ఈపీడీసీఎల్‌లో ముత్యాలరాజు అమలు చేసిన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వడం, మూడు నెలలు తిరక్కుండానే కలెక్టర్ మీద ఒత్తిడి పెంచడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోననే భయంతో సీఎం ఈ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రి నారాయణకు సూచించారని తెలిసింది.