
చిల్లర కోసం టీడీపీ నేతల బెదిరింపులు!
పెద్ద నోట్లను మార్చేందుకు టీడీపీ నేతలు ఆర్టీసీ అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు.
అమరావతి : పెద్ద నోట్లను మార్చేందుకు అధికార పార్టీ నేతలు ఆర్టీసీ అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. గుంటూరులో ఓ ఉన్నతాధికారిని స్థానిక టీడీపీ నేత చిల్లర కోసం బెదిరించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. తక్కువ మొత్తంలో అయితే ఎలాగోలా సర్దుబాటు చేస్తామని రూ.లక్షల్లో తమకు చిల్లర నోట్లు కావాలని బెదిరిస్తే ఏం చేయలేమని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
ఆర్టీసీ ఎండీ స్వయంగా రూ.500, రూ.వెయ్యి నోట్ల తీసుకోమని చెప్పడంతో ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రయాణీకుల నుంచి తీసుకుంటామే తప్ప పెద్ద మొత్తంలో సొమ్ము తెచ్చి చిల్లర నోట్లు ఇవ్వమని పట్టుబడితే తామేం చేస్తామని అధికారులు వాపోతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఆర్టీసీ అధికారులకు నేరుగా ఫోన్ చేసి పెద్ద నోట్లకు చిల్లర ఇవ్వండి.. లేకపోతే బస్సుల్లో పెద్ద నోట్ల బండిల్స్ తరలిస్తున్నారని పోలీసులతో తనిఖీలు చేయించి ఇబ్బందులు పెడతామని హెచ్చరించారు. దీంతో సదరు నేతకు రూ.రెండు లక్షలకు చిల్లర నోట్లు ఇవ్వక తప్పలేదు. ఇలా అధికార పార్టీ నేతలు చిల్లర నోట్ల కోసం బెదిరింపులకు దిగడంతో ఆర్టీసీ అధికారులకు చిక్కులు తప్పడం లేదు. అసలే ఆర్టీసీకి ఆక్యుపెన్సీ తగ్గిందని, సగటున 20 లక్షల మేర ప్రయాణీకులు తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గత వారం రోజుల్నుంచి రోజుకు 40 లక్షల మందికి మించి ప్రయాణం చేయడం లేదని తెలిపారు.