
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
విజయవాడ : ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళు తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే 494/ 10 విద్యుత్ స్తంభం వద్ద వైర్లు ఒక్కసారిగా తెగి కిలోమీటర్ మేరకు ఉన్న 494/24 విద్యుత్ స్తంభం వరకు వైర్లు పూర్తిగా ధ్వంస మయ్యాయి.
ఆ సమయంలో రైలు వేగంగా వెళుతోంది. దీంతో రైలింజన్ ఫాంటో విరిగి పడిపోయింది. కిలోమీటరున్నర మేరకు విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ వైర్లు తెగటంతో మంటలు వ్యాపిం చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు వెంటనే రైలును నిలిపివేయగా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రాత్రి 8.40 నుంచి 11 వరకు రైలు నిల్చిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను ఆయా రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు.