మే నెల రానే వచ్చేసింది. ఎండ తీవ్రత మితిమీరిపోతోంది. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే భయపడుతున్నారు.
సాక్షి, ముంబై: మే నెల రానే వచ్చేసింది. ఎండ తీవ్రత మితిమీరిపోతోంది. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే భయపడుతున్నారు. మహిళలు ఎండ వేడిమినుంచి రక్షణ కోసం స్కార్ఫ్‌లను ఆశ్రయిస్తున్నారు. మగవాళ్లు టోపీలు, కళ్లజోళ్లనే నమ్ముకుంటున్నారు. సాయంత్రం ఆరు,ఏడు గంటల వరకు వేడి తగ్గడంలేదు. దీనికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ముంబైకర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వడదెబ్బ తగిలి రోజూ వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఉపాధి కోసం రోజూ కిలోమీటర్ల మేర ప్రయాణం చేసే చిరుద్యోగుల పరిస్థితిని వివరించాల్సిన పనిలేదు. వలసజీవుల పరిస్థితి సైతం దీనికి విరుద్ధంగా లేదు. ఇదిలా ఉండగా, ఎండ తీవ్రత పెరగడంతో శీతల పానీయాల విక్రయాలు పెరిగాయి. దాంతో వాటి ధరలు సైతం అమాంతం పెరిగిపోయాయి. సీజనల్‌గా వచ్చే పుచ్చకాయలు సైతం రూ.80 నుంచి రూ.100 ధర పలుకుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలకు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.
వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు...
ఎండలో తిరిగినా, పనిచేసినా శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో వడదెబ్బకు గురవుతారు.
శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పెరుగుతుంది.
వడదెబ్బకు గురైన వ్యక్తికి తల తిరగడం, తలనొప్పి, చర్మం ఎండిపోయి ఎక్కువ జ్వరం కలిగి ఉంటారు.
మగతగా కలవరించడం, ఫిట్స్ రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్తారు.
వడదెబ్బ బాధితుల్లో 40 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది.
రక్షణ పొందండిలా..
గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగరాదు.
ఎండ తీవ్రత ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరం.
మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.
తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఉప్పు కలిపిన మజ్జిగ, పళ్ల రసాలు తాగి వెళ్లాలి.
సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలి.
లేత రంగు, కాటన్ దుస్తులను ధరించడం మంచిది.
ఇంటి గదుల్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.
చల్లని వాతావరణం కోసం ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్లు వాడాలి.
వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని వెంటనే చల్లబర్చాలి.
చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి శరీరంపై ఉన్న దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగాలి. చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి.
చల్లని గాలి తగిలేలా ఉంచి చల్లని ఉప్పు కలిగిన నీటిని తాగించాలి.